ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. జగన్ కు అదే చివరి డెడ్ లైన్ అని, ఆ రోజు జగన్ కు బెయిలా? జైలా? అన్న విషయం తేలిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై ఇటు జగన్, అటు రఘురామ లిఖిత పూర్వక వాదనలు సమర్పించగా….జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని నాంపల్లి సీబీఐ కోర్టుకే సీబీఐ అధికారులు వదిలేశారు.
జగన్ బెయిల్ రద్దు విషయంలో న్యాయం జరుగుతుందని, ఓపికగా వేచి చూద్దామని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గత విచారణ జరిగిన రోజు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను రఘురామ కలవడం చర్చనీయాంశమైంది. అయితే, తాను అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానని రఘురామ చెప్పారు. ఏపీకి చెందిన వివిధ అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు రఘురామ వెల్లడించారు.
షాతో భేటీ కావడం సంతోషదాయకమని, బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తనను కలిసేందుకు అవకాశమిచ్చిన అమిత్ షాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రఘురామ అన్నారు. అయితే, జగన్ బెయిల్ రద్దు వ్యవహారం మాట్లాడేందుకే షాతో ఆర్ఆర్ఆర్ భేటీ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ సారి రఘురామ బాణం తప్పదని, జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమని ఆర్ఆర్ఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. షా అపాయింట్ మెంట్ కోసం జగన్ నానా తిప్పలు పడుతుంటే…రాజుగారికి మాత్రం ఇట్టే అపాయింట్ మెంట్ దొరుకుతోందని సెటైర్లు వేస్తున్నారు.