ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు బెయిల్ రద్దు చేయాలని భావించిన సీబీఐ…జగన్ సీఎం అయిన తర్వాత బెయిల్ రద్దు నిర్ణయం కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సహా పలువురు టీడీపీ నేతలు పెదవి విరిచారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సీబీఐ తీరుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్‌కు రఘురామ లేఖ రాశారు. జగన్ తరపున వాదించిన న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై రఘురామ అభ్యంతరం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సుభాష్ వాదించారని, అందుకే ఆయనను స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపిన జగన్ చిన్నాన్న వైస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ప్రముఖ డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి కేసు, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐ విచారణ జరుపుతోందని, ఈ నేపథ్యంలో సుభాష్ నియామకం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తోందని అన్నారు. జడ్జిలపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షించాల్సిందిగా సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.
ఇటువంటి కీలక పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో జగన్ తరపున పనిచేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ గా నియమించడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని రఘురామ లేఖలో డిమాండ్ చేశారు. కాగా, వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, న్యాయమూర్తులను దూషించిన పంచ్ ప్రభాకర్ ను సీబీఐ అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.