సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందులోన్న ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు బెయిల్ పై విడుదలవుతారని అంతా భావించారు. అయితే, ఆర్మీ ఆస్పత్రి వైద్యులను మెజిస్ట్రేట్ డిశ్చార్జ్ సమ్మరీ కోరడం…దీంతో, రఘురామకు మరో 4 రోజుల పాటు వైద్యం అందించాలని వైద్యులు జవాబివ్వడంతో రఘురామ విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆర్మీ కమాండర్‌కు రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆ లేఖలో రఘురామ పేర్కొన్నారు. తాను పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడుతున్నప్పటికీ తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని రఘురామ లేఖలో పేర్కొన్నారు. బీపీలో కూడా హెచ్చుదల కనిపిస్తోందని, నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖలో వెల్లడించారు. మరో, రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని రఘురామ కోరారు.
ఒకవేళ తనను డిశ్చార్జ్ చేయాలనుకున్న పక్షంలో డిశ్చార్జ్ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు ఎస్కార్ట్ పోలీసులు ఆర్మీ ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తనకు తెలిసిందని కూడా లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
కాగా, గుంటూరు అర్బన్ ఎస్పీకి రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టు ధిక్కార నోటీసులు పంపి షాకిచ్చిన సంగతి తెలిసిందే. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని, ఎస్కార్ట్‌ను అర్బన్ ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఇలా చేయడం సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడేమనని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. దీంతోపాటు, రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి డిశ్చార్జ్ సమ్మరీ రావడానికి మరో 4 రోజులు పడుతుందని చెప్పారు. కాబట్టి, 4 రోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని, అప్పటివరకు రఘురామ బెయిల్‌పై విడుదల కావడం వీలుకాదని లక్ష్మీనారాయణ వెల్లడించారు.