ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. తనపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా రాజద్రోహం కేసు పెట్టినప్పటి నుంచి రాజుగారు దూకుడు పెంచారు. జగన్ ను పల్లెత్తు మాట కూడా అనకుండానే…తన లేఖాస్త్రాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజుగారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ మింగుడు పడడం లేదు.
ఈ క్రమంలోనే గత 8 రోజులుగా జగన్ కు వరుసగా లేఖలు సంధిస్తోన్న ఆర్ఆర్ఆర్…తాజాగా తొమ్మిదో లేఖ రాశారు. జగన్ ప్రారంభించిన అమ్మఒడి… నాన్నబుడ్డిగా మారిందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం హామీకి జగన్ కట్టుబడి ఉండాలని రఘురామ చురకలంటించారు. ‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో రఘురామకృష్ణరాజు వరుసగా తొమ్మిది రోజులు తొమ్మిది లేఖలు రాశారు.
ఎన్నికలకు ముందు జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని, కానీ, జగన్ పాలనలో మద్యం నియంత్రణ కంటే మద్యపాన ప్రోత్సాహకం ఎక్కువగా జరుగుతోందని విమర్శించారు. గతేడాదితో పోల్చితే 16% మద్యం అమ్మకాలు పెరిగాయని, మద్యపాన నిషేధం హామీకి ఆకర్షితులైన మహిళలు వైసీపీకి ఓటు వేసి భంగపడ్డారని గుర్తు చేశారు. మద్యంపై రాబడిని అమ్మఒడి పథకానికి ఇస్తామన్నారని, పేద, మధ్యతరగతి ప్రజల భరించలేని విధంగా పన్నులు పెంచారరని విమర్శించారు.