ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ పీఆర్సీ విషయంలో ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన సంగతి తెలిసిందే. పీఆర్సీపై కొందరు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేసినా…మెజారిటీ ఉద్యోగులు దానిపై సంతృప్తిగా లేరు. దీంతో, ఈ పీఆర్సీని అంగీకరించబోమని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తామంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని, అవసరమైతే సమ్మె చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ ఉద్యోగ సంఘాలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బాసటగా నిలిచారు. ఈ పీఆర్సీకి నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని ఆర్ఆర్ఆర్ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన నివాసంలోనే దీక్ష చేయబోతున్నానని అన్నారు. ఉద్యోగులకు జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని, ఈ తరహా కోతలు చరిత్రలో లేవని దుయ్యబట్టారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితో ఉన్నాయని, తనతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని రఘురామ పిలుపునిచ్చారు.