రాష్ట్రంలోని 3 ప్రాంతాలు ముఖ్యం కాబట్టే విశాఖను పరిపాలనా రాజధాని చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేయడానికే వైసీపీ నేతలు విశాఖపై వల్లమానిన ప్రేమను వలకబోస్తున్నారని టీడీపీ సహా విపక్ష నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితేనేం, దున్నపోతు మీద వాన పడ్డరీతిలో ఈ విమర్శలను వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు.
విశాఖలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ భూములపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం నడుచుకోవాలని కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే దసపల్లా భూముల వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు.
విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు, దసపల్లా భూములను హెల్త్ రిసార్ట్ పేరిట కొనుగోలు చేశారని, ఆ కారణంతోనే విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా చేయాలనుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. ఈ భూముల కొనుగోళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా? అని విజయసాయిరెడ్డిని రఘురామ ప్రశ్నించారు. శాసనసభలో 3 రాజధానుల ప్రకటన తర్వాతే ఆ భూములు కొనుగోలు చేశామని చెబుతారా అని నిలదీశారు.
సీతమ్మధారతో పాటు భీమిలి అవతలి భారీగా భూ కుంభకోణాలు జరిగాయని రఘురామ ఆరోపించారు. అనకాపల్లిలో వాగులు, వంకలు పూడ్చేసి 400 నుంచి 500 ఎకరాల్లో లేఅవుట్లు వేశారని ఆరోపించారు. బలవంతంగా భూములను అగ్రిమెంట్ చేయించుకుంటున్నారని, ఆ విషయాలపై చర్చించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్న భూ బాధితులను వైసీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు.