ఏపీ రాజధానిపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడుంటే అక్కడే రాజధాని అని…అది విశాఖ అయినా…మరో నగరమైనా అంటూ గౌతమ్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే మూడు రాజధానులంటూ వైసీపీ నేతలు ఏపీ పేరును దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టించారని, ఇక, తాజాగా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ సాక్ష్యాత్తూ ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో భారత రాజ్యాంగం అమలులో ఉందో లేదోనని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గౌతమ్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. సీఎం ఎక్కడుంటే..అక్కడే రాజధాని అని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆర్ఆర్ఆర్ చురకలంటించారు. సీఎం విధుల గురించి ఆర్టికల్-164లో ఉందని, ఆ ఆర్టికల్ ను గౌతమ్ రెడ్డి చదువుకోవాలని ఎద్దేవా చేశారు. మేకపాటి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రఘురామ దుయ్యబట్టారు.
శ్రీబాగ్ ఒప్పందాల, ఒడంబడికల గురించి సీఎంకే తెలుసనుకోవడం సరి కాదని రఘురామ హితవు పలికారు. రాష్ట్రంలో జరిగే మార్పులపై కేంద్రానికి అధికారం ఉందన్న సంగతి ఆర్టికల్-3లో ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 153, 154 నిబంధనల ప్రకారం రాష్ట్రాల కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నరే సుప్రీమ్ అని, మంత్రుల కంటే సీఎం.. కొంచెం ఎక్కువని వివరించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక..రాయలసీమ ప్రాంతం అయిన కర్నూలులో రాజధాని, కోస్తాంధ్ర ప్రాంతం అయిన గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని అన్నారు.
ఆ తర్వాత కాలగమనంలో ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధాని అయిందని గుర్తు చేశారు. అయితే, ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత 2014, 15 అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండడానికి సీఎం జగన్ అంగీకరించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ను జగన్ వెంటనే రద్దు చేయాలని, వృద్ధులకు వలంటీర్ వ్యవస్థ నుంచి విముక్తి కలిగించి నేరుగా పెన్షన్లను నగదు బదిలీ చేయాలని అన్నారు.