సీఎం జగన్ పై వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీంతో, జగన్ చెల్లెలు అయినప్పటికీ షర్మిలపై కొందరు వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు బూతులు తిట్టిస్తున్నారని రఘురామ మండిపడ్డారు. తనకు జరిగిన నష్టం గురించి, తన పట్ల జగన్ తీరు గురించి షర్మిల వెల్లడిస్తుంటే వైసీపీ నేతలు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె రాజశేఖరరెడ్డి కూతురే కాదన్న రీతిలో ప్రచారం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల గురించి నీచంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇక, తనపై కూడా సోషల్ మీడియాలో వైసీపీ చెత్త ప్రచారం చేస్తోందని, అయినా ఉపయోగం లేదని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని అన్నారు. ముందు తనపై పోటీ చేసే అభ్యర్థిని చూసుకోవాలని చురకలంటించారు. తనపై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఎవరో చెప్పాలని, లేకపోతే తనపై జగన్ పోటీ చేయాలని రఘురామ సవాల్ విసిరారు. మరి, రఘురామ సవాల్ పై జగన్, వైసీపీ నేతలు స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.