ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కంట్లో నలుసులా, పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామపై చర్యలు తీసుకోలేక…పార్టీ నుంచి తీసేయలేక…అనర్హత వేటు వేయించలేక జగన్ సతమతమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తనపై అనర్హత వేటు వేయించాలని రఘురామ ఛాలెంజ్ చేసినా…జగన్ అండ్ కో దానిని స్వీకరించలేదు.
దీంతో, వారి బాధ చూడలేక తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, కానీ, తనపై అనర్హత వేటు వేయించలేనని జగన్ ఒప్పుకుంటేనే అలా చేస్తానని రఘురామ షరతుపెట్టారు. ఈ క్రమంలోనే రఘురామపై సందు దొరికిందంటే చాలు కక్ష సాధించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉంటున్నారు. రఘురామ ఏ చిన్న విషయంలో దొరికినా..కేసు పెట్టాలని, ఆయనను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై రఘురామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని రఘురామ ఆరోపించారు. జగన్‌రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారి తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి మైండ్‌లో ఏముందో తనకు తెలియడం లేదని ఆర్ఆర్ఆర్ అన్నారు..ఎలాగో తనను ఏపీకి రానివ్వడం లేదని, హైదరాబాద్ కూడా రానివ్వరా ఏంటి? అని ప్రశ్నించారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదని అన్నారు. సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలే గమనిస్తున్నారని చెప్పారు. ఒక ఎంపీకి ప్రశాంతంగా జీవించే హక్కు లేదా? నా హక్కును హరించే అధికారం జగన్‌కి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.
తన వ్యక్తిగత హక్కును హరిస్తున్నారని, ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాశానని చెప్పారు. తనపై నిఘా, పవన్‌పై పగ జగనన్నకి ఎందుకు? అని ప్రశ్నించారు. భీమ్లానాయక్లో పవన్ అద్భుతంగా నటించారని, పవన్ ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ చేస్తే… పేర్నినాని ఎక్స్ట్రార్డినరీ ఓవర్ యాక్షన్ చేశారని ఎద్దేవా చేశారు. భీమ్లానాయక్‌పై పేర్నినాని సారథ్యంలో జగన్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నో కుట్రలు చేసి కొన్నిచోట్ల థియేటర్లు బంద్ చేశారని ఆరోపించారు. అనవసరంగా సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ అల్లరి పాలయ్యారని, జగన్ వైఖరితో పార్టీ దెబ్బతింటోందని రఘురామ మండిపడ్డారు.