ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను, జగన్ పాలనను రఘురామ తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఇరకాటంలో పడేస్తున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై ఆర్ఆర్ఆర్ తన మార్క్ కామెంట్లతో, సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ జరగబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన జగన్ పై సెటైర్లు వేశారు.
మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని, బొత్స, పెద్దిరెడ్డి వంటి మహామహులను తీసేస్తే జగన్కు చిక్కులు తప్పవని జోస్యం చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, దానిని చూసి జగన్ భయపడుతున్నారని అన్నారు. స్థలాలపై కన్నేసిన జగన్…ఎయిడెడ్ పాఠశాలలపై మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా జగన్ కు స్థలాపేక్ష లేకుంటే తక్షణమే జీవో 42,50,51లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సజ్జల ఆదేశాలతోనే పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నారని రఘురామ ఆరోపించారు. అమరావతి రైతుల మహాపాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని ఆర్ఆర్ఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. పచ్చగా ఉన్న ప్రాంతాల మధ్య సజ్జల చిచ్చు పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ఎయిడెడ్ పాఠశాలల వ్యవహారంపై జగన్ మనసు మారడం శుభపరిణామనని చెప్పారు.ఎయిడెడ్ పాఠశాలలపై రాజకీయం చేస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని చురకలంటించారు. ఎయిడెడ్ కాలేజీల స్వాధీనంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు.