ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామరాజు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.జగన్ పాలనను ఎండగడుతూ…ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న రఘురామ రాజు వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో రఘురామ అరెస్టు వ్యవహారం తెరపైకి వచ్చిందన్న వాదనలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, అరెస్టు చేయిస్తే తనకు రాజుగారు భయపడతారనుకున్న జగన్ ను రాజుగారే వరుస లేఖలు, ఫిర్యాదులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తుండడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
దీంతో, ఏం చేయాలో పాలుపోని వైసీపీ ఎంపీలు పాత చింతకాయపచ్చడి వంటి అస్త్రాన్ని మరోసారి బయటకు తీసి రాజుగారిని భయపెట్టాలని చూస్తున్నారు. గతంలోనే రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు…తాజాగా జగన్ -షా భేటీ నేపథ్యంలో మరోసారి రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు విన్నపాలు సమర్పించారు. రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. షాకు రాజుగారిపై జగన్ ఫిర్యాదు చేశారని…దీంతో, ఆర్ఆర్ఆర్ పై చర్యలకు షా ఆదేశాలివ్వడంతోనే ఓం బిర్లాను భరత్ కలిశారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో తనపై అనర్హత వేటు వేాయాలని ఇచ్చిన ఫిర్యాదుపై రఘురామ స్పందించారు. తాను ఏ పార్టీతోనూ జతకట్టలేదని, వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, కాబట్టి తనపై అనర్హత వేటు వేయలేరని రాజుగారు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తాను జగన్ సర్కారు సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని రఘురామ వెల్లడించారు. కొందరు తప్పుడు వ్యక్తుల నుంచి వైసీపీని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే తాను చేశానని, నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని, తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు.
దీంతోపాటు భరత్ ఫిర్యాదు, జగన్-షా భేటీ, వైసీపీ నేతల ప్రచారంపై రాజుగారు స్పందించారు. తనపై ఈ నెల 10న ఫిర్యాదు చేశారని, కానీ, మైలేజీ కోసం షాతో జగన్ భేటీ అయిన తర్వాత 11న ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతల గాలి తీశారు. గత ఏడాది కాలంలో తన అనర్హత వేటుపై ఇప్పటికే దాదాపు ఐదు సార్లు ఫిర్యాదు చేశారని, తనపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ కాదని ఆయన గుర్తు చేశారు.