ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురికి భిన్నంగా కనిపించాలన్న తపన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలా చేయటం ద్వారా తమ మార్క్ ను ప్రదర్శించుకోవటంతో పాటు.. వార్తల్లో వ్యక్తిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్ వీర్ సింగ్ తాజాగా చేసిన న్యూడ్ ఫోటో షూట్ ను నిదర్శనంగా చెప్పొచ్చు. అతగాడి న్యూడ్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారటమే కాదు.. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఒక మ్యాగ్ జైన్ కోసం అతగాడు చేసిన న్యూడ్ ఫోటో షూట్ కు ప్రత్యేక కారణం ఏమంటే.. 1972లో కాస్మోపాలిటన్ మ్యాగ్ జైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్కు నివాళిగా దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఫోటో షూట్ చేసిన రణ్ వీర్ సింగ్ ఏమైతే లక్ష్యంగా పెట్టుకున్నారో.. అదంతా జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావటమే కాదు.. భారీ చర్చకు తెర తీసింది. అతడిపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది.
అయితే.. దీనిపై తాజాగా ఒక ఎన్జీవో తీవ్రంగా రియాక్టు అవుతూ.. ఈ ఫోటో షూట్ మీద సదరు నటుడి మీద చట్టపరమైన చర్యలకు ఆదేశించాల్సిందిగా ఫిర్యాదు చేయటంతో అతగాడు ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయటం ద్వారా కొత్త కష్టం అతనికి ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఇతగాడి బోల్డ్ షూట్ పై ప్రశంసలు ఏ రీతిలో వస్తున్నాయో.. విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తుండటం గమనార్హం. ముంబయి మహానగరంలోని చెంబూర్ పోలీస్ స్టేషన్ లో రణ్ వీర్ తీరుపై కేసు నమోదైంది. ఇంతకీ దీనికి చెప్పిన కారణం ఏమిటో తెలుసా? మహిళల మనోభావాల్ని దెబ్బ తీసినట్లుగా పేర్కొన్నారు.
ఇక.. ఈ ఫోటో షూట్ మీద బెంగాలీ నటి కమ్ టీఎంసీ ఎంపీగా వ్యవహరిస్తున్న మిమీ చక్రవర్తి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రణ్ వీర్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ను ఎవరైనా నటి కానీ చేసి ఉంటే? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నటి ఇదే తరహాలో న్యూడ్ ఫోటో షూట్ చేసి ఉంటే.. ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టి ఉండేవారని.. లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగే వారన్నారు. ఇటీవల కాలంలో స్టారో హీరో ఇమేజ్ ఉన్న పలువురు న్యూడ్ ఫోటో షూట్ లు చేయటం ద్వారా సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారుతూ వార్తల్లో వెలిగిపోతున్నారు. తాజా కేసు నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.