వైసీపీలో సిట్టింగ్ అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్న కొద్దీ ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లకు ఊతమిస్తూ వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో కొద్ది రోజులుగా రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, కానీ, దానికి తాను బాధ్యుడిని కాదని లావు క్లారిటీనిచ్చారు.
నరసరావుపేటలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని, దీంతో క్యాడర్ అయోమయానికి గురయ్యారని లావు అన్నారు. ఈ క్రమంలోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని లావు చెప్పుకొచ్చారు. అయితే, లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు లోక్ సభ లో నిలవాలని సీఎం జగన్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు.
ఈ విషయాన్ని మీడియా ముందు ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. లావుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేకపోవడంతో చివరకు ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లతో లావు కొద్దిరోజుల క్రితం భేటీ అయ్యారని పుకార్లు వస్తున్నాయి. నరసరావుపేట ఎంపీ టికెట్ లావుకు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని, కొద్ది రోజుల్లోనే లావు టీడీపీలో చేరబోతున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.