ఏపీలో ఎటు నుంచి ఎవరు రాజకీయ పార్టీలు మారుతున్నారనే విషయం గందరగోళంగా మారింది. టీడీపీలో ఉన్నవారు.. వైసీపీలోకి వస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వారు మళ్లీ వైసీపీకి జై కొడుతున్నారు. దీంతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందనే విషయం గందరగోళంగా మారింది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు విషయం కూడా ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది. వైసీపీలో అవమానాలు ఇక భరించే ఓపిక లేదంటూ జగన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకే వచ్చారు.
ఇప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూ రు పార్లమెంట్ స్థానం నుంచి జగన్ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు.. వైసీపీ కీలక నేత అప్పాయింట్మెంట్ కోసం.. లావు ఎదురు చూస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను ఎవ్వరి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదని, ఎవరినో కలవాలని చూడటం లేదని, ఎవరిని దేనికోసం ప్రాథేయపడటం లేదని స్పష్టం చేశారు.
ఏం జరిగింది?
లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన నరసరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసరావుపేట టికెట్ కోరుతున్నారు. కానీ, పార్టీ మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పింది. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు పలుమార్లు సీఎం జగన్ తో భేటీ అయి విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో పార్టీని వీడారు. ఇటీవల నరసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు.
నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉద్యోగాలు, వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఆయన తిరిగి వైసీపీలో చేరతారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, ఇది నకిలీ అని.. తాను ఎవరి కోసమూ ఎదురు చూడడం లేదని లావు వ్యాఖ్యానించడం గమనార్హం. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు.