ఏపీ సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రోజు భేటీ అయ్యారు. జగన్ తనకు నచ్చారని, ఆయన పేదల పక్షపాతి అని కొనియాడారు. లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేక పంపానని, ఆమోదం పొందంగానే వైసీపీలో చేరతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమం కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జగన్ పథకాలు చూసి ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కలిసి పని చేద్దామని జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు. సీఎంవోకు కూతురు కేశినేని శ్వేతతో కలిసి జగన్ ను నాని కలిశారు. జగన్ తో భేటీ మీడియాతో మాట్లాడిన నాని….చంద్రబాబు, లోకేష్ ల పై షాకింగ్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు తనను మోసం చేశారని, తన కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. చిన్నికి టికెట్ ఇవ్వడం ఆయన ఇష్టమని, కానీ, రాజమండ్రితో పాటు నరసరావుపేట ఖాళీగా ఉన్నా తన సీటు ఇస్తున్నారని అన్నారు. తనను చెప్పు తీసుకొని కొడతానని, క్యారెక్టర్ లెస్ ఫెలో అని, గొట్టం గాడు అని తిట్టినా పార్టీ నుంచి స్పందన లేదని వాపోయారు. ఆ అవమానాలు తట్టుకోలేక పార్టీ నుంచి వెళతానంటే చంద్రబాబు ఒప్పుకోలేదని అన్నారు. పార్టీ కోసం, తన రాజకీయ జీవితం కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని అన్నారు. ఆ రోజు తాను హైదరాబాదులో అమ్మిన ఆస్తుల విలువ ఈ రోజు అక్షరాల 2000 కోట్ల రూపాయలని చెప్పారు. కొన్ని విషయాల్లో తన పట్ల చంద్రబాబు తీరు వల్ల వ్యాపారాలు ఆపుకోవాల్సి వచ్చిందని, అయినా ఆ రోజు బాధపడలేదని చెప్పుకొచ్చారు.
బెజవాడ ఎంపీగా ఉన్న తనకు చెప్పకుండా కేసినేని చిన్ని ఎంపీ అభ్యర్థి అని ఇన్చార్జ్ లంఅందరికి చెప్పడం ఏం సంకేతాన్ని ఇస్తుందని నిలదీశారు. తిరువూరు సభ బాధ్యతను చిన్నికి అప్పగిస్తే నాని అన్న ఎందుకు జోక్యం చేసుకున్నాడని లోకేష్ ప్రశ్నించినట్టుగా తనకు తెలిసిందని అన్నారు. తనకు అధికారిక సమాచారం ఇవ్వలేదు కాబట్టే తాను వచ్చానని నాని అన్నారు. అయినా, తమ వంటి సీనియర్లపై ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ పెత్తనం ఏంటని అన్నారు. చంద్రబాబుకు కొడుకు అన్న అర్హత కాకుండా లోకేష్ కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, జిల్లాలో పార్టీని భుజాలపై మోశానని చెప్పారు.