ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల భద్రతకు వాలంటీర్లు భంగం కలిగిస్తున్నారని, ప్రజల, మహిళల డేటా సేకరించి దానిని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు పవన్. వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని, మహిళల గొంతులు కోస్తున్నారని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఏపీలో 30 వేల మహిళల మిస్సింగ్ అని, అందుకు వాలంటీర్లు కూడా ఒక కారణమని పవన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఆ వ్యవహారంపై పార్లమెంట్లో కూడా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై, జగన్ ప్రభుత్వం పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థతో అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇస్తే పార్టీ కోసమే పని చేస్తారని చురకలం అంటించారు. అత్యంత పారదర్శక నగదు బదిలీ విధానంలో పెన్షన్ అందించడమే ఉత్తమం అని అన్నారు. మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీ చేయాలనుకుంటే స్వాగతిస్తామని చెప్పారు.
కానీ, మధ్యప్రదేశ్ లో అవినీతి గురించి మాట్లాడే ముందు తెలంగాణలో అవినీతి గురించి చూసుకోవాలని సీఎం కేసీఆర్ కు ఆయన చురకలంటించారు. ముఖ్యమంత్రి లాడ్లీ లక్ష్మీ పథకంతో మధ్యప్రదేశ్లో మహిళలు సంతోషంగా ఉన్నారని చౌహాన్ వెల్లడించారు. 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తున్నామని, ఆ డబ్బుతో వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తమ కాళ్ళపై తాము నిలబడుతున్నారని చెప్పారు. ఆ సొమ్మును దశలవారీగా 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా, ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.