వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లే నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారుండడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీసీలే లేరన్నట్లు తెలంగాణలో బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఆ సీట్లు అమ్ముకున్నారన్న పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలకు బలం చేకూరేలా వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
డబ్బులకే రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే… రూ.100 కోట్టు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నారంటూ బీద మస్తాన్ రావు షాకింగ్ కామెంట్లు చేశారు. ఒక్కో సీటును వైసీపీ రూ.100 కోట్లకు అమ్ముకుందంటూ వైసీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ ఆరోపణలు నిజమైతే సీటుకు రూ.200 కోట్లు ఇచ్చేందుకైనా ఓసీ అభ్యర్థులు సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది.
అధికారంలో ఉన్న వైసీపీకి డబ్బుతో పనేంటని ఆయన ప్రశ్నించారు. రూ.10 కోట్లు, రూ.100 కోట్లతోనే కాలం గడిచిపోదంటూ వ్యాఖ్యానించారు.పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎంత డబ్బు ఇచ్చి ఉంటారని ఆయన ప్రశ్నించారు. తనతో పాటు రాజ్యసభ సీటు దక్కిన ఆర్.కృష్ణయ్య ఆర్థిక పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనంటూ మస్తాన్ రావు వ్యాఖ్యానించారు.
అయితే, మస్తాన్ రావు కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. ఆయన నోటి నుంచి రెండొందల కోట్ల ముచ్చటి వచ్చిందంటే నిజంగానే సీటుకు ఆ రేటు పలికే ఉంటుందని అంటున్నారు. అయితే, జగన్ తన కేసులు వాదించిన నిరంజన్ రెడ్డికి ఉడతా భక్తిగా సీటు ఇచ్చి రెండొందల కోట్లు కాకున్నా…ఎంతో కొంత పుచ్చుకునే ఉంటారని అంటున్నారు.