దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక గెలుపు ఇచ్చిన కిక్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ ఎస్ కు బీజేపీ గట్టిపోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ పై సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన వాస్తుదోషం కేసీఆర్ అని, కేసీఆర్ ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఎన్ని యాగాలు చేసినా కేసీఆర్ చేసిన పాపాలు పోవని బండి సంజయ్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో రిపీట్ అవుతాయని, ఈ కారణంతోనే కేసీఆర్ కు భయం పట్టుకుందని సంజయ్ చెప్పారు.
సాగర్ లో బీజేపీని ఢీకొట్టేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. సాగర్ కు కేసీఆర్ చేసిందేమీ లేదని, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాడుతోందన్నారు. టీఆర్ఎస్ పై తమ పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ సర్కారులో అవినీతి రాజ్యమేలుతోందని, తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అజయ్ భూ కబ్జాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామని షాకింగ్ కామెంట్లు చేశారు. వైద్య కళాశాల పేరుతో పువ్వాడ అజయ్ భూదోపిడీకి పాల్పడ్డ సంగతి ప్రజలకు తెలుసని సంజయ్ చెప్పారు. భూ కబ్జాల కోసమే ఎర్రజెండాను వదిలి అజయ్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.