వైఎస్ వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో కీలక తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది అన్న విషయంపై అవినాష్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. లైవ్ వీడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అవినాష్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా చనిపోయారని శివప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, అప్పటికే తాను జమ్మలమడుగు బయలుదేరానని అన్నారు. జీకే కొండారెడ్డి అనే వ్యక్తి వైసీపీలో అదే రోజు చేరబోతున్నారని, ఆ కార్యక్రమం కోసం తాను జమ్మలమడుగు వెళ్తుండగా ఫోన్ వచ్చిందని చెప్పారు. తాను వివేకా ఇంటికి వెళ్లేసరికి వివేకా పీఏ కృష్ణారెడ్డి అక్కడే ఉన్నారని, బాత్రూంలో ఉన్న డెడ్ బాడీని చూపించారని వెల్లడించారు. తాను అక్కడికి వెళ్ళకముందే వివేకా రాసిన లెటర్, మొబైల్ ఫోన్ మాయమయ్యాయని అన్నారు.
అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని కృష్ణారెడ్డి తనకు చెప్పారని అన్నారు. డ్యూటీకి తొందరగా రమ్మన్నానని వారించినందుకు తన డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చేలా కొట్టాడని, ఆ లెటర్ రాయడానికి తాను చాలా కష్టపడ్డాను అని, డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దని ఆ లెటర్లో రాసి ఉన్నట్లు అవినాష్ రెడ్డి చెప్పారు. కానీ, ఆ లెటర్ గురించి పోలీసులకు సునీత ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇంత కీలకమైన లెటర్ ను సీబీఐ కూడా డౌన్లోడ్ చేస్తుందని ఆరోపించారు.
సీబీఐ అధికారి రామ్ సింగ్ ఎవరిని కాపాడాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఇక, సీబీఐ విచారణలో సునీత కూడా రెండు వేరువేరు స్టేట్మెంట్లు, ఇచ్చిందని ఆమెకు అంత సమయాన్ని అధికారులు ఎందుకు ఇస్తున్నారని అవినాష్ ప్రశ్నించారు. తాజాగా అవినాష్ కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వివేకా కేసులో అవినాష్ కొత్త పిట్టకథ…విన్నారా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.