ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీటీడీలో అనేక వ్యవహారాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం మొదలు రమణ దీక్షితులు నియామకం వరకు ఎన్నో నిర్ణయాలు దుమారం రేపాయి. టీటీడీ అధికారుల తీరు కూడా బాగోలేదని భక్తులు పలు మార్లు విమర్శలు గుప్పించారు. టీటీడీపై సినీనటి నమిత కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. టీటీడీ అధికారులు తీరుపై నమిత తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నమిత…భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఇటీవల టోకెన్ల క్యూ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనతో జగన్ హయాంలోని టీటీడీ పాలక మండలి ప్రతిష్ట మరింత మసకబారింది. ఇక, జగన్ వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో మరో వివాదానికి వైసీపీ సర్కార్ కేంద్ర బిందువుగా మారింది. తిరుమలలోని ఎల్ఈడీ స్క్రీన్‌పై శుక్రవారం సినిమా పాటలు ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది.
తిరుమలలో బ్రాడ్కాస్ట్ ఉద్యోగిగా పనిచేసే ఓ వ్యక్తి తన స్నేహితుడిని బ్రాడ్ కాస్ట్ గదిలోకి తీసుకురావడం కలకలం రేపింది. సదరు ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత అతడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుంఠం-2 వరకు వెళ్లారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అయితే, బ్రాడ్కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏది ఏమైనా పవిత్రమైన తిరుమలలో వరుసగా ఈ తరహా ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.