పేద దేశంలో బంగారుకొండ బయటపడింది.. పలుగు.. పారలు పట్టుకొని వెళుతున్నారు
ఆదో పేద దేశం. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అలాంటి దేశంలో బంగారు కొండ బయటపడితే? అలాంటి వేళ..ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపే వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దేశం ఏది? అక్కడ నిజంగానే బంగారు కొండ బయటపడిందా? అందులో నిజం ఎంత? అన్న విషయాల్లోకి వెళితే..
అత్యంత పేద దేశాల్లో ఒకటైన కాంగోలో నిజంగానే బంగారు కొండ ఒకటి బయటపడింది. దాన్ని తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత బంగారాన్ని ఇస్తోంది. తొలుత ఒకరిద్దరికి మాత్రమే ఈ బంగారు కొండ గురించి తెలుసు. రోజులు గడుస్తున్న కొద్దీ.. కొండ దగ్గర హడావుడి పెరిగింది. ఇప్పుడు రద్దీ ఎంతలా అంటే.. పలుగులు.. పారలు పట్టుకొని.. ఎవరికి చిక్కినంత వారు.. కొండను తొలుచుకుంటూ పోతున్నారు.
కొండను తవ్వి బంగారాన్ని తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగోలోని దక్షిణ కివు రాష్ట్రం లుహిహిలో ఉన్న ఆ కొండ మట్టిలో 60 నుంచి 90 శాతం వరకు బంగారం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి అందరికి తెలిసింది. దీంతో.. ఈ కొండను తొలిచి పెద్ద ఎత్తున బంగారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ బంగారుకొండ గురించి సమాచారం అందుకున్న ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు అహ్మద్ అల్గోబరి దానికిసంబందించిన ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిప్పుడు తెగ వైరల్ గా మారింది. మరోవైపు ఈ బంగారు కొండ వద్దకు ఎవరూ వెళ్లకూడదంటూ అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఇదంతా బంగారుస్మగ్లర్లకు కొండను దోచి పెట్టటానికే ప్రభుత్వం ఇలాంటి పని చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.