అంతా అయిపోయిన తర్వాత.. కళ్లు తెరిస్తే ఏం లాభం? ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది యూపీలోని యోగి సర్కారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. యోగి ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది హాథ్రస్ ఘోరకలి.
ఈ హత్యాచార (ప్రభుత్వం కాదంటోంది) ఉదంతంలో బాధితురాలి విషయంలో నిందితులు ప్రదర్శించిన తీరు ఒక సంచలనమైతే.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు మరింత రచ్చకు కారణమయ్యాయి. ఏదైనా ఒక దారుణ ఘటన జరిగినప్పుడు.. దాన్ని మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం కంటే కూడా.. న్యాయ బద్ధంగా విచారణ నిర్వహించటానికి మించిన సులువైన పని మరొకటి ఉండదు.
అలా జరిగితే.. దారుణం జరిగిన దాని కారణంగా చోటు చేసుకునే విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వ నిబద్ధత.. విచారణ విషయంలో ప్రదర్శించే తీరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుంది. దిశ ఉదంతంలో తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా ఎక్కడా వేలు పెట్టటం ఉండదు. మొత్తం పోలీసులకు వదిలేయటం.. వారి విచారణకు అడ్డు తగిలి.. తమ నిర్ణయాలతో ఇష్యూ మరింత పీటముళ్లు పడేలా చేయటం కనిపించదు. అదే తీరును హాథ్రస్ ఉదంతంలో యోగి సర్కారు అమలు చేసినా.. ఇంత గొడవ ఉండేది కాదు.
అందుకు భిన్నంగా హత్యాచారం జరగలేదని.. నిందితుల తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడటం.. మీడియాను అనుమతించకపోవటం.. విచారణ విషయం అనుసరించిన విధానాలు.. ఇలాంటివన్నీ ఈ ఇష్యూను మరింత తీవ్రతరం చేయటంతో పాటు.. రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వాల లోపాల్ని బహిర్గతం చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బాధితురాలి ఇంటికి నిందితుల తరఫున వచ్చినోళ్లు ఏకంగా హెచ్చరికలు జారీ చేసే వీడియోలు విడుదలై మరింత సంచలనంగా మారింది. ఓవైపు కుమార్తెను కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబం.. ఇప్పుడు తీవ్రమైన హెచ్చరికలు ఎదురుకావటంతో ఊరు వదిలి వెళ్లేందుకు సైతం సిద్ధమైన వైనం యోగి సర్కారును మరింత అప్రదిష్ట పాలయ్యేట్లు చేసింది.
ఇలా.. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా బుక్ అయిన బీజేపీ సర్కారు ఎట్టకేలకు కళ్లు తెరిచింది. బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భద్రతా చర్యల్ని ఏర్పాటు చేశారు. 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా 24 గంటలూ కాపలా కాసేలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు.. ఇతర కారణాల మీద వచ్చే అందరి వద్ద వివరాలు సేకరిస్తున్నారు.
అంతేకాదు.. బాధితురాలి ఇంటికి డీఐజీ షాలాభ్ మాథుర్ అనే అధికారికిన రాజధాని లక్నో నుంచి దారుణం చోటు చేసుకున్న బుల్గర్హి గ్రామానికి పంపి.. నోడల్ అధికారిగా నియమించారు. మహిళా పోలీసుల్ని కూడా ఏర్పాటు చేశారు. వీరంతా బాధిత కుటుంబానికి.. సాక్ష్యులకు రక్షణగా నిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి చర్యలేవో.. ఘటన వెలుగు చూసినంతనే చేసి ఉంటే.. ఇప్పటివరకు చుట్టుముట్టిన విమర్శలు.. ఆరోపణలు ముప్పాతిక ఉండేవి కాదు కదా? తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకోకుండా తప్పుల మీద తప్పులు చేసి.. ఇప్పుడు ఇంతమంది భద్రతా సిబ్బందిని పెడితే కలిగే ప్రయోజనం ఏమిటో యోగి సర్కారుకే తెలియాలి.