ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి కకావికలం చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తో దేశాలన్ని అతలాకుతలమవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ వచ్చినా…ఆ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం…చాలామంది కరోనా నిబంధనలు పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రెమిడెసివర్, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజలకు, అటు వైద్యులకు భారత బయోటెక్ కంపెనీ తీపి కబురు చెప్పింది.
కరోనా పాలిట బ్రహ్మాస్త్రంలా పని చేసే ట్యాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మహారాష్ట్రకు చెందిన ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ (ఎఫ్ బీఎల్) అనే సంస్థ వెల్లడించింది. మోల్నుపిరావిర్ అనే ట్యాబ్లెట్ కరోనాపై బ్రహ్మాండంగా పనిచేస్తోందని వెల్లడించింది. కరోనాకు అతి తక్కువ ఖర్చుతో విరుగుడు కనిపెట్టామని, ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఆ మందు సత్ఫలితాలనిచ్చిందని ఆ సంస్థ చెబుతోంది. ఈ ట్యాబ్లెట్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని చెబుతోంది.
అయితే, ఈ ట్యాబ్లెట్ కొత్తదేం కాదు. ఎంకే 4482 అని శాస్త్రవేత్తలు పిలుచుకునే మోల్నుపిరావిర్ ను ఇప్పటికే ఫ్లూ చికిత్సలో వాడుతున్నారు. ఆ మందు పనితీరుపై అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), బ్రిటన్ లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో సత్ఫలితాలు వచ్చాయని, కరోనా సోకడానికి 12 గంటల ముందు, కరోనా వచ్చిన 12 గంటల తర్వాత ఆ మందును ఎలుకలకు ఇచ్చి చూశారని ఓ మెడికల్ జర్నల్ ప్రచురించింది. కరోనా వైరస్ నుంచి మోల్నుపిరావిర్ మంచి రక్షణ కల్పించినట్టు పరిశోధకులు గుర్తించారని ఆ జర్నల్ లో వెల్లడించింది.
ఆ మందును ఒక్కదాన్నే ఇచ్చినా, లేదా ఇతర యాంటీ వైరల్ మందులతో కలిపి ఇచ్చినా కరోనాను సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఎలుకల మీద సత్ఫలితాలనిచ్చిన ఈ ఔషధాన్ని మనుషులపైనా ప్రయోగించి చూస్తున్నారు. ఇప్పుడు ఆ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ 2/3 తుది దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషులపైనా వస్తే కరోనాకు బాహుబలి వంటి అస్త్రం లభించినట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.