కొన్నిసార్లు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు ప్రముఖ నటులు మంచు మోహన్ బాబు. కొన్ని సందర్భాల్లో తనకు తిరుగులేదని.. తనకు ఎవరు సాటి రారన్న రీతిలో మాట్లాడే ఆయన మరొకొన్ని సందర్భాల్లో మాత్రం.. తనకు అందరూ థోకా ఇచ్చారన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఒకదానికి ఒకటి పొంతన లేనట్లుగా ఉండే ఆయన మాటల్ని చూసినప్పుడు.. ఇవేం మాటలు అనిపించక మానదు.
ఈ మధ్యన జరిగిన ‘మా’ ఎన్నికల సందర్భంగా తన కొడుకు విష్ణును అధ్యక్షుడిగా గెలిపించుకోవటం కోసం చేసిన ప్రయత్నాలు.. ఆయన వ్యవహరించిన తీరు సంచలనంగా మారటమే కాదు.. బోలెడన్ని విమర్శలు ఆయన మీద వచ్చాయి.
అలాంటి మోహన్ బాబును మోసం చేసేవారు.. హ్యాండిచ్చే వారు ఉంటారా? అన్న ప్రశ్న తరచూ తొలుస్తూ ఉంటుంది. తాజాగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతి సమీపంలో ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ‘నేను ఇతరులకు ఉపయోగపడ్డా. నాకు మాత్రం ఎవరూ ఉపయోగపడలేదు. ఎంతోమంది నాతో ఎన్నికల ప్రచారం చేయించుకొని.. నాకేమీ చేయలేదు. ఇలా ఎన్నో రకాలుగా మోసాలకు గురయ్యా.ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. జీవితం గురించి ఇప్పుడు తెలుస్తోంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదే కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోహన్ బాబు తన ముక్కుసూటితనంతో కొన్ని కోల్పోయారని.. మరికొన్ని సంపాదించారన్నారు. ఈ మాటనే తీసుకుంటే.. పోగొట్టుకున్న వాటి గురించి చెప్పే మోహన్ బాబు సంపాదించుకున్న వాటి గురించి ఎందుకు ఓపెన్ కారన్నది మరో ప్రశ్న.
అయినా.. మోహన్ బాబు లాంటి ప్రముఖుడ్ని మోసం చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకూ ఆయన్ను వాడుకొని వదిలేసినోళ్లు ఎవరు? అయినా.. ఇంత వయసు వచ్చిన తర్వాత.. జీవితం గురించి ఇప్పుడు తెలియటం ఏమిటి మోహన్ బాబు? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.