ఏపీ సీఎం జగన్ సమయం సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటారన్న మీమ్ ను మంచు లక్ష్మి షేర్ చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. కావాలనే మంచు లక్ష్మి అలా జగన్ కు వ్యతిరేకంగా ట్రోల్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మంచు కుటుంబంలో జగన్పై అసంతృప్తి గట్టిగానే ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. వైసీపీని నమ్ముకొని ఉన్న మోహన్ బాబును జగన్ కూరలో కరివేపాకులా వాడేసి వదిలేశారని, ఏ పదవి కూడా ఇవ్వలేదని, అందుకే ఆయన వైసీపీకి దూరంగా వేరే పార్టీలకు దగ్గరగా మసలుకుంటున్నారని టాక్.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున సినీ తారలు పలువురు ప్రచారం చేశారు. వారిలో చాలామందికి జగన్ న్యాయం కూడా చేశారు. కమెడియన్ అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి, మంగ్లీకి టీటీడీ ఎస్వీబీసీ చానల్ సలహాదారు పదవి, పోసానికి ఏపీఎఫ్డీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇక, వైసీపీకి రాజీనామా చేయకముందు పృథ్వీకి కూడా ఎస్వీబీసీ ఛైర్మన్ గా పదవినిచ్చారు. అయితే, సీనియర్ నటుడు అయిన మోహన్ బాబుకు మాత్రం జగన్ మొండి చేయి చూపించారు.
రాజ్య సభకు మోహన్ బాబును పంపుతారని ప్రచారం జరిగినా..అది సాధ్యం కాలేదు. అయితే, టీటీడీ ఛైర్మన్ గా ఒక్క విడత అయినా పని చేయాలని మోహన్ బాబుకు ఉందట. కానీ, ఆ చాన్స్ కూడా దక్కలేదు. అందుకే, గతంలో మోహన్ బాబు కూడా వైసీపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినంటూ ఆయన చేసిన కామెంట్స్ గతంలో కాక రేపాయి. చెప్పారు.
ఇక, సినిమా టికెట్లు రేట్ల వ్యవహారంలో టాలీవుడ్ తరఫున చిరంజీవి అండ్ కో కు ఆహ్వానం అందిందని, తనకు ఆహ్వానం అందలేదని జగన్ పై మోహన్ బాబు గుర్రుగా ఉన్నారన్న టాక్ వచ్చింది. తనకు ఆహ్వానం అందకుండా కొందరు కుట్ర పన్నారని కూడా మోహన్ బాబు ఆరోపించారు. జగన్ కు మద్దతిచ్చినందుకు మోహన్ బాబు పశ్చాత్తాపడుతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక, 2024 ఎన్నికల్లో మోహన్ బాబు తిరుపతిలో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతారేమోనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై మంచు లక్ష్మి కామెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.