గిల్లితే గిల్లించుకోవాలి..ఇదొక ఫేమస్ డైలాగ్.. పోకిరీ సినిమాలో ప్రకాశ్ రాజ్ అనే ఓ విలక్షణ నటుడు చెప్పే డైలాగ్.
ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పెద్దలకు తాము దగ్గర వాళ్లం అని, బంధువులం అని, స్నేహితులం అని,శ్రేయోభిలాషులం అని చెప్పుకునేవాళ్లంతా కాస్త విమర్శలను తట్టుకునే ఉండాలి.
లేకపోతే ప్రజాస్వామ్యంలో అసలు సెటైరిక్ వెర్షన్ అన్నదే ఉండదు. ఉండేదంతా అనుచరుల పొగడ్తలు తప్ప మరొకటి ఉండదు.
తాజాగా మోహన్ బాబు సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది. సన్నాఫ్ ఇండియా పేరిట రైటర్ డైమండ్ రత్నబాబు రూపొందించిన ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కూడా ట్రోలింగ్స్ అన్నవి విపరీతంగా జరుగుతున్నాయి.
దీంతో వీటిని తట్టుకోలేక పది కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంచు ఫ్యామిలీ చెబుతోంది.
తక్షణమే ట్రోలింగ్ మేటర్ ను తొలగించాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థలకు వార్నింగులు ఇస్తోంది. ఇవన్నీ సమంజసంగా లేవని మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.
అసలు ఫన్ ను ఫన్ గానే తీసుకోవాలని వాటి వెనుక ఎలాంటి ఇంటెన్షన్ ఉన్నా సరే, అవన్నీకేవలం సరదాగా కోసమే అని,ఆ పాటి స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ఉంటే ఎలా అని వీరంతా ప్రశ్నిస్తున్నారు.
గతంలో మా ఎన్నికల సమయంలో ఎక్కువగా విష్ణు బాబు వ్యాఖ్యలు, తరువాత అలీతో సరదాగా కార్యక్రమంలో తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ట్రోల్ అయ్యాయి.
అప్పటి నుంంచి మంచు విష్ణు కుటుంబం సోషల్ మీడియా అంటేనే మండిపడుతోంది.
ఇదే సమయంలో విమర్శలకు భయపడిపోతే ఎలా అని జనసేన కూడా కౌంటర్లు ఇస్తోంది.
జనసేన అనే కాదు చాలా మంది సినిమా అభిమానులు కూడా ట్రోలర్స్ లో ఉన్నారు.
ఇదే సమయంలో గతంలో జరిగిన పరిణామాలనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రోలర్స్. ఎస్ ఎస్ రాజమౌళి కానీ ప్రభాస్ కానీ ఇతర హీరోలెవ్వరు కానీ ట్రోల్స్ ను ఎంజాయ్ చేసిన వారే అని, ఫొటో కామెంట్లు అంటే ఇష్టపడిన వారే అని ఆ రోజు వాళ్లు ఏ పాటి అడ్డు చెప్పి,మాట్లాడినా సినిమా హైప్ ఆ విధంగా ఉండేదే కాదని బాహుబలిని ఉద్దేశించి అంటున్నారు.
ఇక పొలిటికల్ గా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ చెప్పిన మాటలు చర్చలోనే ఉన్నాయి.
సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కాదని, ఆ విషయం తెలుసుకుని ఉన్న పరువు కాస్త పోగొట్టుకోకుండా మెలిగితే మేలు అని కూడా ఇంకొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు హితవు చెబుతున్నారు.
ఎందుకంటే ఇవాళ పేరున్న నాయకులు అంతా కూడా ట్రోలర్స్ చేతిలో బాధితులే అని..,అయినా కూడా అదొక ఫన్ జోనర్ అని దానిని సీరియస్ గా తీసుకుంటే అస్సలు పబ్లిక్ డొమైన్ లో ఇమడలేమని కూడా అంటున్నారు.
అయితే వీటిని కూడా వినిపించుకునే స్థితిలో మంచు ఫ్యామిలీ లేదని తెలుస్తోంది.
దీంతో వివాదాన్ని మరింతగా పెంచి పోషిస్తోంది. ఇదే విధంగా అన్ డెమొక్రటిక్ మోడ్ లో మాట్లాడుకుంటూ వెళ్తే మోహన్ బాబు ఫ్యామిలీ కి సంబంధించి ట్రోల్స్ పెరగుతాయే తప్ప తగ్గవు గాక తగ్గవు.. అని సోషల్ మీడియా యాక్టివిస్టులు, జనసేన సభ్యులు అంటున్నారు.