ప్రధాని మోడీ స్వామి మౌనంలో ఉన్నారు. ఎక్కడో సముద్ర తీరంలో కన్యాకుమారి వద్ద ఆయన వివేకానం ద మెమొరియల్‌లో సుదీర్ఘ ధ్యానంలో మునిగిపోయారు. 45 గంటల పాటు ధ్యానంలో ఉన్నారని.. అన్నపా నీయాల స్థానాల్లో కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ప్రధాని మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రకృతి మౌనంగా ఉండదు కదా! చిత్రమైన వాతావరణ పరిస్థితులు దేశాన్ని కుదిపేస్తున్నాయి.
ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలు మండిపోతున్నాయి. 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమైదు కావడంతో మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతం రగిలిపోయింది. దాదాపు 46 మంది దేశవ్యాప్తంగా చనిపోయారు. ఇక, రాజస్థాన్‌లోనూ 52-54 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్ వ్యాప్తంగా నానా తిప్పలు పడుతున్నారు. ఎండల దెబ్బకు ఉత్తరాదిలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రోడ్లపై నీళ్లు చిమ్ముతున్నారు. ఇలా.. ఉత్తరాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.
ఇక, ఈశాన్య రాష్ట్రాల్లో మరోచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ రేమల్ తుఫాను ఎఫెక్ట్‌కు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిసి.. నగరాలకు నగరాలే నీట మునిగాయి. దీంతో అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రజలు నిర్వాసితులు అయ్యారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే చోటు చేసుకున్నాయి. వీటిపై ఆయా రాష్ట్రాల కోర్టుల్లో పిటిషన్ పడ్డాయి. వీటిని విచారించిన కోర్టులు.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి.
ఎండలు, తుఫానును జాతీయ విపత్తుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించాయి. అసలు ఈసమ యంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తున్నారని మహారాష్ట్రలోని నాగపూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. కట్ చేస్తే.. ఇలాంటి సమయంలో అందుబాటులో ఉండి..ఆయా రాష్ట్రాల పరిస్థితులను సమీక్షించాల్సిన ప్రధాని మోడీ… స్వామి అవతారం ఎత్తడం, మౌనంగా కూర్చోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం.