పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగించారు. దేశం అభివృద్ధి పథంలో వడివడిగా ముందుకు సాగుతోందని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముర్ము పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం.. ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పనిచేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామని రాష్ట్రపతి తెలిపారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని చెప్పారు. మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చుతున్నాయని, 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్యబీమా కల్పించిన విషయాన్ని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి తెలిపారు. 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తెచ్చామన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాను ప్రస్తావించారు. మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. పురాతన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని తెలిపారు.
అయితే.. ఇటీవల మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, ఇటీవల కన్నుమూసిన పూర్వ ప్రధాని, ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.