బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య సమ్ థింగ్ జరిగిపోయింది. ఇరు వర్గాలు రాజీకి వచ్చేశాయి. అందుకే.. నరేంద్ర మోడీ .. ఆయన సర్కారుపై కేసీఆర్.. కేటీఆర్ లు విమర్శలు చేయటం తగ్గించేశారన్న విశ్లేషణలు ఎక్కువ కావటం తెలిసిందే. అదే సమయంలో.. రేపో..మాపో అరెస్టు కావటం ఖాయమనుకున్న ఎమ్మెల్సీ కవితకు అభయహస్తం వచ్చేసిందని.. ఆమెకు ఏమీ కాదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వాదనల్లో ఏమాత్రం పస లేదన్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే నేరుగా రంగంలోకి దిగి.. ఎమ్మెల్సీ కవిత పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై గురి పెట్టిన తీరు సంచలనంగా మారింది.
ఓటుబ్యాంకు రాజకీయాలకు బీజేపీ దూరమన్న మోడీ.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేరా బూత్.. సబ్ సే మజ్ బూత్ పేరుతో నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ‘కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలి. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలి. కుటుంబ పార్టీలపై మాట్లాడిన ఆయన.. తాను అవినీతిపరుల్ని వదిలి పెట్టనని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీకి కార్యకర్తలే పెద్ద బలంగా వ్యాఖ్యానించారు.
తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమన్న మోడీ.. బుజ్జగింపులు.. ఓటుబ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ.. సంబంధం లేని వేదిక మీద నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించటం.. ఆమె కుమార్తె కవిత పేరుతో విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. మోడీ వ్యాఖ్యలకు మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.