బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును పురందేశ్వరి ఖండించిన నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. పురంధేశ్వరిపై వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారని రఘురామ మండిపడ్డారు.
మహిళ అని, ఓ పార్టీ అధ్యక్షురాలు అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడుతున్నారని ఆ విమర్శలు వింటుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై జగన్ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని, రాష్ట్రంలో మహిళలకు జగన్ ఇస్తున్న రక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి జగన్ నిజస్వరూపం తెలిసిందని, భవిష్యత్తులో ఏపీలో జైలర్ సినిమా కనిపించబోతుందని జోస్యం చెప్పారు.
జైలర్ సినిమాలో సొంత కొడుకు అక్రమాలను తట్టుకోలేక రజనీకాంత్ తన కొడుకుని చంపేస్తాడని, రాష్ట్రంలో కూడా అటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, రాబోయే ఎన్నికలలో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతానని రఘురామ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
ఏపీలో ప్రతి పథకానికి జగన్ లేదా వైఎస్ఆర్ పేరు పెడుతున్నారని, ప్రధానమంత్రి పేరును కనిపించి కనిపించనట్లు చిన్నగా వేస్తున్నారని ఆరోపించారు. ఇలా, కేంద్ర పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టుగా కేంద్రానికి తెలిసిపోయిందని, అందుకే 5,300 కోట్ల రూపాయల నిధులను ఆపేశారని రఘురామ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఓ పక్క సీఎం ఫోటో మరోపక్క పిఎం ఫోటో వేస్తే ఇబ్బంది లేదని, అలా కాకుండా సొంత జేబులో డబ్బులు ఇస్తున్నట్టుగా తన ఫోటో లేదా తన తండ్రి ఫోటో వేయడం ఏమిటని ప్రశ్నించారు.