మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వందల కోట్ల రూపాయలు ఆశజూపి ఆ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన అంశం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో బాధతో ఈ వీడియోను అందరికీ చూపిస్తున్నానని, దేశాన్ని అన్ని రంగాల్లో బిజెపి సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వీడియోలో ఎవరూ ఊహించని విషయాలు బట్టబయలవుతాయని అన్నారు. బిజెపి జుగుప్సాకర రాజకీయాలు చేస్తోందని, బెంగాల్లో పర్యటించిన మోడీ టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం అని మండిపడ్డారు. తెలంగాణలో పర్యటించిన అమిత్ షా…తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పడం ఏమిటని మండిపడ్డారు. దేశంలోని అన్ని మీడియా సంస్థలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ అధ్యక్షులకు హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు కూడా ఈ వీడియో పంపిస్తామని చెప్పారు.
అందరూ కలుగజేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఆ వీడియోలో వాళ్లు ప్రస్తావించిన పేర్లు దేశంలోని పెద్ద నేతలవని, ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టామని, మరో నాలుగు రాష్ట్రాలలో కూడా కూలగొడుతున్నామని చెప్పారని వివరించారు. తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్ర, రాజస్థాన్ ఇలా ఈ నాలుగు రాష్ట్రాలు లిస్టులో ఉన్నాయని, తెలంగాణ తర్వాత ఆంధ్రా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్ర చేస్తుందని ఆరోపించారు.
కేరళలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయిన తుషార్ అనే బిజెపి నేత ఈ మొత్తం ఎపిసోడ్ కు సూత్రధారి అని, 24 మంది ఈ ముఠాలో ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు. తమ స్కానర్ లో ఉంటే వై క్యాటగిరి భద్రత, ఇన్ కమ్ టాక్స్ నుంచి రక్షణ అన్ని కల్పిస్తామంటూ చెబుతున్నారని వారు అలా చెబుతున్నారంటే వారి వెనక ఎంతో పెద్దవారు ఉన్నారని అన్నారు. అమిత్ షా పేరును కొన్నిసార్లు ప్రధాని మోడీ పేరుని కొన్నిసార్లు ప్రస్తావించారని ఆరోపించారు. ఏదేమైనా కేసీఆర్ విడుదల చేసిన వీడియో, చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.