టీడీపీ అధినేత చంద్రబాబు హఠాత్తుగా దిల్లీ రావడం.. వచ్చీరాగానే రాత్రి అమిత్ షాతో భేటీ కావడం.. మళ్లీ ఉదయాన్నే దిల్లీ నుంచి రిటర్న్ కావడం.. అక్కడికి కొద్ది గంటల్లో ఆజ్ తక్, సీ ఓటర్ సర్వే రావడం.. టీడీపీ విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చేయడం.. ఇవన్నీ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా వైసీపీ నేతల్లో భయం పెంచాయి.
ఏపీలో ఉన్న 25 లోక్ సభ సీట్లలో టీడీపీ 17 చోట్ల విజయం సాధిస్తుందని.. వైసీపీకి 8 సీట్లు మాత్రమే దక్కుతాయని ఆ సర్వే తేల్చింది.
అంటే ప్రస్తుతం 3 సీట్లున్న టీడీపీ 14 సీట్లు పెరిగి 17కి చేరుతుంది.. ఇప్పుడు 22 సీట్లున్న వైసీపీ అందులో 14 కోల్పోతుంది.
అసెంబ్లీ ఫలితాలలోనూ టీడీపీ హవా చాటుకుంటుందని ఈ సర్వే తేల్చేసింది.
2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే చేశారు. అంటే చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.
అయితే… ఈ సర్వే కంటే ముందే మోదీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలతో ఏపీలో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గాల స్థాయిలో లెక్కలు తెలుసుకుంటున్నారట. మోదీ లెక్కల్లో కూడా టీడీపీ దూసుకుపోనుందనే తేలింది. అందుకే.. వెంటనే అమిత్ షా ద్వారా టీడీపీకి కబురు పంపి చంద్రబాబును పిలిపించుకున్నారు.
చంద్రబాబు గాలిలో తాము కూడా ఎక్కువ లోక్ సభ సీట్లు సాదించుకోవచ్చన్న వ్యూహంతో 8 సీట్లు వరకు కావాలని చంద్రబాబు ముందు అమిత్ షా డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే… చంద్రబాబు కూడా గెలుపుపై గట్టి నమ్మకంతో ఉండడం వల్ల అన్ని సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని.. అలా అని పొత్తుల చర్చలు ఏమీ క్లోజ్ కాలేదని దిల్లీ వర్గాల టాక్.
బీజేపీయే ఒక మెట్టు దిగి రెండు సీట్లు తగ్గించుకుని 6 సీట్లు కావాలని అడగనున్నట్లు సమాచారం.
మొత్తానికి చంద్రబాబు వచ్చిన రోజునే ఇండియాటుడే సర్వే కూడా రావడంతో బీజేపీ కాస్త డిఫెన్సులో పడింది. కానీ, నిజానికి మోదీ దగ్గర కూడా దాదాపు ఇదే రిపోర్ట్ ఉండడంతో వారు ఎలాగైనా ఈసారి చంద్రబాబుతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నట్లు సమాచారం.