అనకాపల్లి ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాన నరేంద్ర మోడీ తొలిసారిగా నేరుగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్, ఆయన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జల వనరుల ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, కానీ జగన్ దానిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండు మధురమైనవి, అద్భుతమైనవి, తియ్యనివి అని, జూన్ 4న ఈ తీయదనం మరింత పెరగబోతుందని ఎన్నికల ఫలితాలనుద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోందని, కేంద్రంలో కూడా ఎన్డీఏ గెలవబోతోందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు వల్ల ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని, ఆ తర్వాత అభివృద్ధి కొత్త తీరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ ఒకటేనని, కర్ణాటకలో ట్యాంకర్ మాఫియా ప్రభుత్వం నడుస్తుందని, ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా ప్రభుత్వం నడుస్తోందని మోడీ విమర్శించారు. ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలకు రక్షణ కల్పిస్తామని అన్నారు.
ఏపీ కోసం కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. కేంద్రం పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ కోసం అవసరమైన భూమిని కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం లక్షల సంఖ్యలో ఇళ్లు కేటాయించినా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదని ఆరోపించారు. ఎన్డీఏ మంత్రం అభివృద్ధి అని, వైసీపీ మంత్రం అవినీతి అని సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల చెరుకు పరిశ్రమ రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. మత్స్యకారులకు భీమా సౌకర్యం కల్పిస్తామని, ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు.