వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా తయారైన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలో మారిన ఆర్ఆర్ఆర్….వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ సర్కార్, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. మరోవైపు, బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉండే రఘురామ….అడపాదడపా వారితో ముచ్చటిస్తూ తన బలం ఇదని ప్రూవ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఏపీలో దేవాలయాలపై దాడుల వ్యవహారంపై ఇటీవల కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాతో రఘురామ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోడీతో రఘురామ భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో 18 నిమిషాలపాటు జరిగిన సమావేశం అద్భుతంగా సాగిందని రఘురామ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుపై మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, చర్చిల నిర్మాణానికి టెండర్లు పిలవడంపై మోడీ షాకయ్యారని రఘురామ తెలిపారు.
రాజధాని మార్పు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులతో పాటు అనేక విషయాలను మోడీకి వివరించానని రఘురామ చెప్పారు. తాను లేవనెత్తిన అన్ని అంశాలకు మోదీ సానుకూలంగా స్పందించారని రఘురామ చెప్పారు. మోడీ చేతులపై శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేశారని, పేద రైతులకు అన్యాయం జరుగుతోందని మోడీ దృష్టికి తీసుకువెళ్లానని రఘురామ అన్నారు.
దేవాలయాలపై దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరానని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని చెప్పానని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై మోడీ అభయం లభించినట్టుగానే తాను భావిస్తున్నానని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోడీ ఆశ్చర్యపోయారని రఘురామ పేర్కొన్నారు. చర్చిల టెండర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా తనను మోడీ కోరారని రఘురామ చెప్పారు.