ఉత్తరప్రదేశ్ లో రైతులపైకి వాహనాలు దూసుకుపోయిన ఘటన తదనంతర పరిణామాలతో నరేంద్రమోడి బాగా మండిపోతున్న విషయం అర్ధమైపోతోంది. పోయిన ఆదివారం లఖింపూర్ ఖేరిలో ర్యాలీ చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మద్దతుదారుల కార్లు దూసుకుపోయిన ఘటన దేశంలోనే పెద్ద సంచలనమైంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం రైతులపైకి కేంద్రమంత్రి మద్దతుదారులు కావాలనే వాహానాలను నడిపించినట్లు తేలిపోయింది. తాజా వీడియోను యూపీలోని ఫిలిబిత్ బీజేపీ ఎంపి వరుణ్ గాంధి షేర్ చేశారు.
తాజాగా వీడియోను వరుణ్ షేర్ చేయటమే కాకుండా మొదటినుండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో రైతులకు మద్దతుగా ప్రకటనలు కూడా చేశారు. అలాగే వరుణ్ తల్లి, సుల్లాన్ పూర్ బీజేపీ ఎంపి మేనకాగాంధీ కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.
దీని ఫలితంగానే తాజాగా ఏర్పాటుచేసిన జాతీయ కార్యనిర్వాహక కమిటిలో ఇద్దరు చోటు కోల్పోయారు. చాలా కాలంగా వీరిద్దరు క్రమం తప్పకుండా జాతీయ కమిటిలో ఉంటున్నారు.
అలాంటిది హఠాత్తుగా ఇద్దరికీ ఒకేసారి జాతీయ కమిటి నుండి ఉధ్వాసన పలకటమంటే ఆశ్చర్యంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రైతులకు మద్దతుగా మాట్లాడటమే అని అందరికీ అర్ధమైపోయింది.
నిజానికి వ్యవసాయ చట్టాలకు విరుద్ధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏమీ మాట్లాడటంలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే పార్టీ, ప్రభుత్వంలోని ఎంతో సీనియర్లు కూడా వణికిపోతున్నారు. అలాంటిది వరుణ్ గాంధీ ధైర్యంగా కేంద్ర్రప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
వరుణ్ వైఖరిని మోడి జీర్ణించుకోలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్లీనంగా ఇదే విషయాన్ని ఎంపికి చెప్పారట కూడా. అయినా ఎంపి లెక్కచేయలేదు. ఈ నేపధ్యంలోనే మొన్నటి ఆదివారం జరిగిన ఘటన తర్వాత వరుణ్ మరింతగా రెచ్చిపోతున్నారు.
రైతులపైకి వాహనం దూసుకుపోయిన ఘటనలో నలుగురు చనిపోతే తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మరణించారు. దాంతో ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఘటనకు ప్రధాన కారణం కేంద్రమంత్ర అజయ్ మిశ్రా కొడుకని ఆరోపణలున్నాయి.
అయితే రైతులపైకి దూసుకుపోయిన కారులో తన కొడుకు లేనేలేడంటు మంత్రి వాదిస్తున్నారు. ఈ విషయంలో నిజమేంటో కాలమే తేల్చాలి. ఏదేమైనా మంత్రి కొడుకుపై కేసు నమోదు కాగానే నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని వరుణ్ పదే పదే డిమాండ్ చేస్తుండటం పార్టీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా ఇబ్బందిగా మారింది. వరుణ్ కు మద్దతుగా తల్లి మేనకాగాంధి కూడా రంగంలోకి దిగారు.
ఈ నేపధ్యంలోనే ఏర్పాటు చేసిన జాతీయ కమిటిలో తల్లీ, కొడుకులకు చోటు గల్లంతవ్వటం ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలంగా వీళ్ళు కమిటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది ఒకేసారి ఇద్దరిని కమిటి నుండి తప్పించటం వెనుక కారణముందంటున్నారు.
అదేమిటంటే రేపటి కమిటి సమావేశంలో పొరబాటున వీళ్ళద్దరి లఖింపూర్ ఖేర్ ఘటనను ప్రస్తావించారంటే సమావేశంలో గోల గోలైపోతుంది. అదే జరిగితే అది మరో సంచలనమవుతుంది. అందుకనే వ్యూహాత్మకంగా ఇద్దరినీ తప్పించేసినట్లు అర్ధమవుతోంది.