ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు, అమరావతి రాజధాని వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న తెలిసిందే. అమరావతి రాజధాని అంటూ వైసీపీ మినహా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా ఉన్నాయి. అయితే, రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని వైసిపి నేతలు మొండిపట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలో జరిగిన విశాఖ గర్జన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. అమరావతికి బిజెపి కట్టుబడి ఉందని, ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా రాజధాని మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని కిషన్ రెడ్డి అన్నారు. పవన్ పర్యటనను అడ్డుకోవడం, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటి వ్యవహారాలపై కిషన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు.
ఇతర రాజకీయ పార్టీలు కార్యక్రమం చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని చెప్పారు. కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి పార్టీకి ఉందని అన్నారు. మరోవైపు, విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని ఆ సభలో తీర్మానం చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం, వైసీపీ నేతల చర్యలను సిపిఐ నేతలు ఖండించారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి నిర్మాణ కొనసాగించాలని హితవు పలికారు.