రాజకీయం అంటే రాజకీయమే. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలూ ఉపయోగించడం.. నేతలకు తెలిసి ఉండాలే కానీ, అంతకుమించి.. అనే రీతిలో రాజకీయాలు చేయొచ్చు. తెలివి ఎవడి సొత్తు గనుక!!
తాజాగా ప్రధాని మోడీ చేసిన రాజకీయం చూసిన తర్వాత.. “ఇది కదా.. పాలిటిక్స్ అంటే“ అని అనిపించకమానదు. అనిపించడమేం ఖర్మ.. నెటిజన్లు, ప్రతిపక్షాలు ఇదే మాట అంటున్నాయి. కానీ, నోరు విప్పి విమర్శించే సాహసం చేయలేవు. అలాగని ఎవరికీ ఫిర్యాదులు కూడా చేయలేవు. పైకి రాజకీయం కాదు.. కానీ, ఫక్తు పొలిటికల్ స్టెప్. ఎంతగా అంటే.. తను అనుకున్నది సాదించేంత!
ఇంతకీ మోడీ ఏం చేశారంటే.. సోమవారం గుజరాత్లో రెండో దశ, అత్యంత కీలకమైన దశగా బావిస్తున్న ఎన్నికలు జరుగుతు న్నాయి. ఇదే అధికార పీఠాన్ని నిర్ణయించనుంది. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. వీటిలో కీలకమైన 42 స్థానాల్లో పటేల్ వర్గం ఓట్లే ఉన్నాయి. వారే ఇక్కడ నిర్ణేతలు కూడా. అయితే, బీజేపీపై ఇప్పుడు వారికి ఆగ్రహం తగ్గినా.. ఎక్కడో ఒక చోట ఆవేదన ఉంది. కాంగ్రెస్కు పడే ఛాన్స్ కూడా ఉంది. మరి మోడీ ఊరుకుంటారా? దీనిని పసిగట్టారు. ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తనను చూసి ఓటేయాలని వారికి కూడా పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. మరి ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఇప్పుడు ఆయనను ఓటర్లు ఎలా చూసేది? ఎలా ఆయనను గుర్తు పెట్టుకునేది. బ్యానర్లు లేవు. ఫొటోలు లేవు. పోనీ.. మనసులో ఉంటే సరిపోతుందా? కళ్ల ముందు కనిపించొద్దా.. గుండెలను తాకొద్దా.. అప్పుడు కదా.. ఓట్ల పంట పండేది! సరిగ్గా ఇదే ఆలోచన చేశారు మోడీ. ప్రజల సెల్ ఫోన్లలో తన చిత్తరువు కనిపించాలని అనుకున్నారో ఏమో.. వెంటనే మెరుపు లాంటి ఐడియా వేసేశారు. ఉభయ కుశలోపరి అంటామే సరిగ్గా అదే వ్యూహం పన్నేశారు.
కనీసం సమాచారం లేకుండానే అనుకున్నదే తడవుగా అమ్మ దగ్గరకు వెళ్లిపోయారు. ఆమె పక్కనే కూర్చున్నారు. ఆమె చేసిన తేనీరు(అట!) సేవిస్తూ.. ఆమెతో పిచ్చాపాటీ మాటలు కలిపారు. ఇలా.. దాదాపు రెండు గంటల పాటు ఆమెతోనే గడిపారు. అయితే, ఊరక రారు అన్నట్టుగా అమ్మను పలకరించిన వీడియోలను ముక్కలు ముక్కలు చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. అంతే.. ఇంకే ముంది.. రేపు ఎన్నికలు జరగనున్న 93 నియోజకవర్గాలకు తోడు దేశం మొత్తం ఇప్పుడు మోడీ స్మరణలో మునిగిపోయింది.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. మోడీ అమ్మను కలిశారు.. కానీ, ఆయన చింత మాత్రం ఓటర్లను కలవడం.. దీనికి ఎలాంటి ఎన్నికల నిబంధనలు అడ్డులేవు.. రావు.. అనేవారు ఎవరైనా ఉన్నారా? అంత సాహసం చేస్తే.. గీస్తే.. వీరికి తల్లి విలువ తెలియదని మోడీ ఎదురు దాడి చేయరా?! ఇది కదా.. రాజకీయ వ్యూహం అంటే..!!
"Men are what their mothers made them!"
PM Modi taking the blessings of his beloved mother, Heeraba Modi, at her residence in Gandhinagar today. pic.twitter.com/CHU131IHbI
— Priti Gandhi (Modi ka Parivar) (@MrsGandhi) December 4, 2022