టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. ఇక, చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది.
ప్రపంచవ్యాప్తంగా డాట్ కామ్ సంస్థలు పుట్టుకొస్తున్న సమయంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ సంస్థలను హైదరాబాద్ లో నెలకొల్పారని ఆయనపై ప్రశంసలు కురిశాయి. ఆ క్రమంలోనే బిల్‌గేట్స్‌ను హైదరాబాద్‌కు రప్పించారని, అప్పట్లోనే చంద్రబాబు పవర్ పాయింట్ ద్వారా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లను ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు విజన్ జీ-20 సమావేశాల సందర్భంగా మరోసారి చర్చకు వచ్చింది.
ఏకంగా మోడీ దృష్టిని చంద్రబాబు విజన్ ఆకర్షించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశం మోడీని ఆకట్టుకుంది. దీంతో, చంద్రబాబు చెప్పిన ఆ అంశాన్ని తన ప్రసంగంలో కూడా మోడీ పేర్కొన్నారు. అంతేకాదు, ఆ డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు మోడీ స్వయంగా సూచించారు. ఈ క్రమంలోనే నేడు నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ నోట్ ను పరమేశ్వరన్ అయ్యర్ కు అందించారు.