వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దేశం మొత్తం మీద ఇప్పటివరకు 12 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా తాజాగా సికింద్రాబాద్ లో 13వ దానిని మోడీ ప్రారంభించారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బిజెపి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. వేదికపై నుంచే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 714 కోట్ల రూపాయలను కేటాయించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పై మోడీ విరుచుకుపడ్డారు.
కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మోడీ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ తీరు వల్లే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దూరం అవుతున్నాయని విమర్శించారు. కుటుంబ పాలన వల్లే ఇలా జరుగుతోందని, ప్రతి ప్రాజెక్టులో తమ వారి స్వార్ధాన్ని ఇక్కడ పాలకులు చూస్తున్నారని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయాయని, దాని నుంచి ప్రజలకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని, అవినీతిని అణచివేస్తున్న తనపై పోరాడేందుకు అన్ని శక్తులు ఏకమయ్యాయని అన్నారు. తెలంగాణలో అవినీతిపరులపై కఠిన చర్యలు తప్పవని మోడీ హెచ్చరించారు. విచారణ సంస్థలను సైతం బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని మండిపడ్డారు. ఈ కుటుంబ పాలనకు చరమ గీతం పాడుదామని పిలుపునిచ్చారు. నిజాయితీగా పని చేసేవారు ఈ కుటుంబ పాలకులకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.