మోడీ రూటే సేపరేటు… ఎక్కడా వివాదాస్పద విషయాలు ప్రస్తావన లేకుండానే ప్రసంగం సాగించారు నిన్న. బీజేపీ జాతీయ సమావేశాల అనంతరం ఆ పార్టీ నేతృత్వాన విజయ సంకల్ప సభ నిర్వహించిన సంగతి విధితమే ! సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు ఆయన అధ్యక్షోపన్యాసం ఇచ్చారు.
ఆపరేషన్ దక్షిణ్ అంటూ సభలో వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలో చెప్పారే కానీ ఎక్కడా కేసీఆర్ ను ఆయన ప్రశ్నలను ప్రస్తావించలేదు. తెలంగాణకు కేంద్రం ఏ విధంగా సాయం అందిస్తున్నదీ కూడా వివరించారు.
అమిత్ షా ప్రసంగంలో కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, ఆరోపణలు ఉన్నాయే కానీ ఇక్కడ మాత్రం అవేవీ లేకుండానే ఉన్నాయి. ప్రధాని ఎందుకని కేసీఆర్ ను పట్టించుకోలేదని ? ఇదే విషయం ఇప్పుడు అంతటా చర్చకు తావిస్తోంది. వాస్తవానికి ప్రధాని రాక మునుపు నుంచి కేసీఆర్ తనదైన యాంటీ క్యాంపైనింగ్ మొదలుపెట్టారు.
సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ నినాదాలు రాయించారు. ఫ్లెక్సీలు పెట్టించారు. అవే ఫ్లెక్సీలను హోర్డింగులకు తగిలించారు. ఇందుకోసం 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మెట్రో పిల్లర్లను అద్దెకు తీసుకుని వాడుకున్నారు. ఇన్ని చేసినా బీజేపీ సభలకు ఎటువంటి అడ్డంకులూ సృష్టించలేకపోయారు. కనీసం కేసీఆర్ చేసిన నిరసనపై ఒక్క మాట కూడా మోడీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడి కేసీఆర్ ను బలవంతుడ్ని చేయడం ఆయనకు ఇష్టం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక మోడీ మాటల్లో ఎక్కువగా దక్షిణాదిని ఎలా గెలుచుకోవాలి అన్న తాపత్రయమే కనిపించింది. తెలంగాణలో పాగా వేయాలని అందుకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ప్రసంగానికి ముందు, తరువాత టీబీజేసీ బాస్ బండి సంజయ్ ను ఒకటికి రెండు సార్లు భుజం తట్టి అభినందించి వెళ్లారు. జాతీయ సమావేశాలు సక్సెస్ అయ్యేందుకు కృషి చేసిన టీబీజేపీ వింగ్ కు అభినందనలు తెలిపారు.
3 రోజుల సంబరంలో తెలంగాణ రుచులు ఆస్వాదించి, శ్రేణులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ప్రత్యర్ధి వర్గాల పేర్లను ప్రస్తావించకుండానే మోడీ తన వ్యూహం ఒకటి అప్పగించి వెళ్లారు టీబీజేపీ లీడర్లకు! అదేవిధంగా ఎంతో ఆసక్తిగా ఉన్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కానీ యశ్వంత్ సిన్హా (విపక్షాల అభ్యర్థి) గురించి కానీ మాట్లాడలేదు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ వస్తుందని మాత్రం అని ఓ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలలో బీజేపీ బలపడాలని కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని, వారసత్వ పాలన నుంచి విముక్తి ఇవ్వాలని నేరుగా కాకపోయినా పరోక్ష రీతిలో ఆ రెండు ఉప ప్రాంతీయ పార్టీల గురించి చెప్పకనే చెప్పారు. కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు లేవు.దూషణ భూషణలు లేవు. ప్రసంగం మధ్యలో తెలంగాణ దేవుళ్లను తల్చుకుని సభికుల దృష్టిని ఆకర్షించాలని భావించారు. రెండు లక్షల మంది ఈ సభకు హాజరు అయ్యారని టాక్.