ఏపీలోని జగన్ సర్కారుకు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్యనున్న రహస్య స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందన్నది మరోసారి ఫ్రూవ్ అయ్యింది. జగన్ ఏం చేసినా.. అందుకు మోడీషాల అనుమతి ఉంటుందన్న విషయంపై క్లారిటీ వచ్చే పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అమరావతినే అని చెప్పే బీజేపీ నేతల మాటలకు భిన్నమైన తీరును ప్రదర్శించింది. తాను శంకుస్థాపన చేసిన అమరావతి ఉనికిని కూల్చే ఆయుధాన్ని జగన్ సర్కారు చేతికి ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది.
అమరావతిలోని ఆర్ 5 జోన్ లో రాజధానేతర ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పటం చూస్తే.. జగన్ సర్కారు ఏం అడిగితే.. దాన్ని ఇవ్వటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధంగా ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఒకవైపు ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా అనుమతులు అడిగినంతనే ఓకే చెప్పేసిన తీరు చూస్తే.. జగన్ తో మోడీ సర్కారు బంధం ఎంత బలమైదన్న విషయంపై మరింత క్లారిటీ వస్తుంది.
అమరావతలోని ఆర్ 5 జోన్ లో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ సర్కారు డిసైడ్ కావటం.. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు.. వ్యతిరేకత వ్యక్తం కావటంతెలిసిందే.దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లటం తెలిసిందే. అయితే.. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న హైకోర్టు కేసులో అక్కడి న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీం పేర్కొంది.
అంటే.. జగన్ సర్కారు ఇళ్ల పట్టాల్ని ఇచ్చినప్పటికీ.. ఒకవేళ హైకోర్టు తీర్పు అందుకు భిన్నంగా వస్తే.. సదరు లబ్దిదారులకు ఎలాంటి హక్కు ఉండదు. అంటే.. కోర్టు తీర్పు ఆధారంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి చోట ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వటం అంటే.. వివాదాన్ని మరింత పొగిడించినట్లే. అమరావతి ఆయువు తీయటమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ సర్కారు.. భారీగా ఇళ్లను నిర్మించటం ద్వారా.. భూములు ఇచ్చిన రైతులకు.. లబ్థిదారులకు మధ్య పంచాయితీ పెట్టేలా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆగమేఘాల మీద 50వేలకు పైగా లబ్దిదారులకు ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశారు. ఇక్కడ ఇళ్లను నిర్మించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని జగన్ సర్కారు కోరింది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా ఇళ్ల నిర్మాణాలకు ఓకే చెప్పేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం నెలలోనే పూర్తి కావటం గమనార్హం. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణ అనుమతుల మీద నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉన్నా.. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
అందునా.. ఈ ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం రూ.1.5 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేలు ఇస్తుంది. దగ్గర దగ్గర రూ.2 లక్షల ఖర్చుతో నిర్మించే ఇంటి నిర్మాణాలు జరిగిన తర్వాత.. కోర్టు తీర్పు భిన్నంగా వస్తే.. వేలాది మంది పరిస్థితేంటి? వారి కలల మాటేమిటి? అప్పటివరకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయిల మాటేంటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే రాజధాని అమరావతిని ఖతం పట్టించేందుకు జగన్ సర్కారు వ్రతం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. వారికి దన్నుగా నిలుస్తూ కేంద్రం సైతం ఆయుధాన్ని ఇవ్వటం చూస్తే.. అమరావతి చంపేసే ప్రోగ్రాంలో కేంద్రంలోని మోడీ సర్కారు కూడా భాగస్వామ్యం అయ్యిందా? అన్న అనుమానాలు రాక మానదు.