విపక్షాల ఐక్యత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. దేశంలోనే కాదు..ఏపీలోనూ వినిపిస్తున్న మా ట. దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు 26 పార్టీలు చేతులు కలిపా యి. దీనికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ రేంజ్లో ఇతర పార్టీలు చేతులు కలపడం అంటే.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదని పరిశీలకులు చెబుతున్నా రు.
ఇదంతా కూడా కేవలం మోడీ కేంద్రంగానే జరుగుతున్న పరిణామంగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి పక్ష నాయకులకు వాయిస్ లేకుండా చేయడంతోపాటు.. కేసులు పెట్టించడం..నాయకులను ఆర్థికంగా బలహీనులను చేయాలనే ఉద్దేశంతో సీబీఐ, ఈడీ వంటివాటిని ప్రోత్సహించడం..దాడులు చేయించడం వంటివాటిని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశామని చెబుతున్నా.. దేశాన్ని ప్రపంచం ముందు.. సగర్వంగా నిలబెట్టేలా చేశామని చెబుతున్నా.. మోడీకి సెగ తప్పడం లేదు.
ఈ క్రమంలోనే దేశంలోని విపక్షాలు ఏకమయ్యాయి. అవుతున్నాయి. మరికొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఏపీ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడకూడా విపక్షాలు ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ-జనసేన-వామపక్షాలు-బీఎస్పీ-ఆప్ సహా ఇతర చిన్నా చితకా పార్టీలు కూడా చేతులు కలిపేందుకు రెడీగా ఉన్నాయి. అయితే.. బీజేపీని వదిలేయాలనే షరతు కొన్ని పార్టీలు పెట్టాయి.
సరే.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇంతగా విపక్షాలు ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది. కేవలం నాలుగేళ్ల పాలనలో వైసీపీ విషయంలో విపక్షాలు కేవలం అధికారం కోసమే వైసీపీని గద్దె దింపాలని చూస్తున్నాయా? అంటే.. ఇది ఒక కారణం మాత్రమే. కానీ, మరిన్ని కారణాలు వేరే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం.. వారిని ఆర్థికంగా కోలుకోకుండా చేయడం ప్రధాన చర్చకు వస్తోంది. రాజకీయంగా చేయాల్సిన విమర్శలు.. సహజం.
రాజకీయాలను కూడా కేసులతో వారిని చుట్టుముట్టేలా చేసి.. వాయిస్ సైతం వినిపించేలా చేయకుండా చేస్తున్నారన్నదే ప్రధాన కారణాల్లో కొన్ని. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలిస్తే.. తమ పార్టీలు ఉంటాయో ఉండవో.. అనే సందేహంతోనే కొన్ని పక్షాలు చేతులు కలిపేందుకు రెడీ అయ్యాయనే వాదన కూడా వినిపిస్తోంది. అంటే.. మొత్తంగాఈ పరిణామాలను గమనిస్తే.. అక్కడ మోడీ అయినా.. ఇక్కడ వైసీపీ అయినా.. విపక్షాల కూటమికి కారణమవుతున్నాయనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.