2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా టీడీపీ సన్నాహాలు మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. జగన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను సానుకూలంగా మలచుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీని ఓడించేందుకు తమతో కలిసి వచ్చే పార్టీలను కాదనుకుండా కలుపుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు, ఏపీలో మారుతున్న పరిస్ధితులను, రాజకీయ పరిణామాలను బీజేపీ అధిష్టానం గోడ మీద పిల్లిలా నిశితంగా పరిశీలిస్తోంది.
వైసీపీ మీద జనం వ్యతిరేకత…జనసేనను నమ్మని జనం…వెరసి టీడీపీయే 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు బీజేపీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే, చంద్రబాబుతో దోస్తీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రెడీ అయ్యారు. చంద్రబాబు దార్శనికుడు కాబట్టే కేంద్రం ఆయన అమరావతి కడతానంటూ కళ్లు మూసుకొని 8500 కోట్ల రూపాయలను ఇచ్చిందని సోము చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక, చంద్రబాబుకు భారత ప్రధాని మోదీ స్నేహ హస్తం చాచడం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి ప్రత్యేకంగా చంద్రబాబును మోదీ ఆహ్వానించారు. చాలాకాలం తర్వాత మోదీ, చంద్రబాబులు ఒకే వేదికపై సందడి చేయడం జాతీయ మీడియా సైతం హైలైట్ చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏకాంతంగా భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు విజనరీ నేతలు దాదాపు 5 నిమిషాలపాటు రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఏపీలో టీడీపీతో పొత్తుకు బీజేపీ తహతహలాడుతున్న నేపథ్యంలో ఆ విషయంపైనే చంద్రబాబుతో మోదీ చర్చించి ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూత్రప్రాయంగా పొత్తు కోసం చంద్రబాబు దగ్గర మోదీ ప్రతిపాదన ఉంచారని ప్రచారం జరుగుతోంది. 2014 మాదిరిగానే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ-బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని, కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందేనని ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.