ఓ వైపు ఏపీలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనాపై జగన్ చేతులెత్తేశారని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే మాట్లాడుకుంటున్న వైనం చర్చనీయాంశమైన విషయం విదితమే. ఇక, జనానికి మాత్రం సవాలక్ష కోవిడ్ రూల్స్ పెట్టిన వైసీపీ నేతలు మాత్రం…కరోనా నిబంధనలు గాలికొదిలేశారని, అందుకే ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వైసీపీ నేతలు కరోనా నిబంధనలు అతిక్రమించి భారీగా ర్యాలీలు, సభలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి బహిరంగ సభలు పెట్టారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమైన చర్య అని, డీజీపీ గౌతమ్ సవాంగ్ వీరిద్దరిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రఫీ డిమాండ్ చేశారు.
చట్టం ముందు అందరూ సమానులే అన్న వాస్తవాన్ని రుజువు చేయాలంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ వారికి చట్టాలు వర్తించవా.. వారు ఏమైనా చేయవచ్చా? ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా.. లేదా? అని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తోట త్రిమూర్తులుకు రావులపాలెం వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే, కోవిడ్ నిబంధనల ప్రకారం 144 సెక్షన్ అమలులో ఉందంటూ జాతీయ రహదారిపైకి వైసీపీ అభిమానులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, నిబంధనలను కార్యకర్తలకు వివరించాల్సిన తోట త్రిమూర్తులు…అందుకు విరుద్ధంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం సిఐ జానకిరామ్ కు తోట త్రిమూర్తులు వార్నింగ్ ఇచ్చి…భారీ ఊరేగింపుతో మండపేట బయలుదేరి వెళ్లారు. దీంతో, ఈ ఘటనపై విమర్శలు వస్తున్నాయి.