మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో, సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారంలో ట్రస్టు చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పులు రాజుగారికి అనుకూలంగా రావడం, జగన్ నియమించిన సంచయితను ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించడం మింగుడుపడని విజయసాయి…అశోక్ గజపతిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవించి సత్తుబొచ్చలో సద్దికూడు తిన్న విజయసాయికి అశోక్ గజపతి రాజును విమర్శించే అర్హత లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అశోక్ గజపతి రాజు వంశస్థులది జనాలను ఆదుకునే చేయి అని, ప్రజలను ఆదుకోవడంలో అశోక్ గజపతిరాజు ముందుంటారని ప్రశంసించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధులైన అశోక్ గజపతిరాజును లూఠీకి ముందుండే ఏ2 రెడ్డివంటి నీచులు విమర్శించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సింహాచలం భూముల్లో విజయసాయికి ఏం పని అని, ఆయన ఎందుకు తలదూరుస్తున్నావని సత్యనారాయణ నిలదీశారు. లక్షలాది కుటుంబాలకు భూదానం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజుదని, మెడపై కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని లాక్కున్న చరిత్ర విజయసాయిదని మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి పేరు విశాఖ రెడ్డిగా మారిపోయిందని, నెల్లూరు జిల్లాలో చెల్లని విసా రెడ్డి..విశాఖకు మకాం మార్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన తెల్ల దరిద్రం ఏ2 అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలిచ్చి వేల కుటుంబాలను ఆదుకున్న ఘనత అశోక్ గజపతిదని, ఉద్యోగులను రోడ్డున పడేశిన ఘనత విజయసాయిదని నిప్పులు చెరిగారు. రాజ కుటుంబీకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంతెన సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు.