హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీద కేసీఆర్‌కు ఉన్న కోపం కౌశిక్ రెడ్డికి వరంగా మారిందా? ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన కౌశిక్‌కు మరో పదవి దక్కనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున ఉప ఎన్నికలో గెలిచిన ఈటల.. కేసీఆర్‌కు షాకిచ్చాడు. ఈ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి చెందడంతో ఈటలపై ఆయనకు పీకల దాకా కోపం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ నియోజకవర్గంలో ఈటలను అడ్డుకునేందుకు కౌశిక్ రెడ్డిని వాడుతున్నట్లు సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున టికెట్ వస్తుందని ఫోన్ కాల్లో మాట్లాడి అది లీకవడంతో దెబ్బతిన్న కౌశిక్‌పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన్ని ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా చేశారు. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్‌ను అడ్డుకునేందుకు వీలుగా ప్రభుత్వ విప్‌ను కూడా చేయబోతున్నట్లు సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం ఈటల కంటే కౌశిక్ పై స్థాయిలో ఉండేలా టీఆర్ఎస్ బాస్ వ్యూహం సిద్ధం చేశారని టాక్. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ముగిసి రెండు నెలలు అవుతున్నా ఇంకా అక్కడ రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఆ ఎన్నికలో గెలిచిన ఈటల రోజూ ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇక ఆ ఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా నిత్యం అక్కడే ఉంటూ పార్ఠీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతినిధులకు ఇంఛార్జీగా వ్యవహరించి క్యాంపు ఏర్పాట్లు చూశారు. అక్కడ ఎమ్మెల్సీ గెలుచుకునేలా గెల్లుతో కలిసి పావులు కదిపారు. ఇప్పుడిక స్థానికంగా బీజేపీని, ఈటలను ఎదుర్కొనేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యతలను కౌశిక్‌కు అప్పగించినట్లు సమాచారం. గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఆయన తమ పార్టీ శ్రేణులు ఈటల వైపు వెళ్లకుండా కాపాడుతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు ప్రభుత్వ విప్ కూడా ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా ఈటల మీద కేసీఆర్ కోపం.. కౌశిక్‌కు మాత్రం మేలు చేస్తోందనడంలో సందేహం లేదు.