ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వచ్చిన సమాచారం కారణంగా ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు అయ్యేలా చేయటం.. ఆమె ఈడీ కస్టడీలో ప్రశ్నల్ని ఎదుర్కోవటం తెలిసిందే. కోర్టు నుంచి అనుమతి పొందిన ఈడీ అధికారులు కవితను ఏడు రోజుల పాటు ప్రశ్నించే వీలుంది. ఇందులో భాగంగా మొదటి రోజు అయిన ఆదివారం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ పర్వం సాయంత్రం ఆరు గంటల పాటు సాగింది. మధ్యలో లంచ్ కోసం కాస్తంత విరామాన్ని ఇచ్చారు. ఈ విచారణ క్రమాన్ని మొత్తంగా వీడియో రికార్డింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సుదీర్ఘంగా సాగిన ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఈడీ ప్రశ్నల వర్షంలో ఎమ్మెల్సీ కవిత తడిచిపోయారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ సాగింది. లిక్కర్ స్కాంకు సంబంధించిన పలు కీలక పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో వాట్సాప్ చాటింగ్ ల మీదా.. కొందరు మధ్యవర్తుల ద్వారా జరిగిన లావావేవీలపైనా ప్రశ్నల్ని ఆమె ఎదుర్కొన్నారని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన వారితో ఎలాంటి సంబంధాలు ఆమెకు ఉన్నాయన్న దానిపై ఆమె విచారణను ఎదుర్కొన్నారు. ఏమేం సంప్రదింపులు జరిపారు? కేసులో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారాన్ని కవిత ముందు ఉంచారని తెలుస్తోంది. వీటి ఆధారంగా పలు ప్రశ్నల్ని సంధించారు. రెండు టీంలుగా కవిత విచారణను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా మొదటి రోజు విచారణ ఎమ్మెల్సీ కవితకు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేలా చేసినట్లుగా తెలుస్తోంది.
తొలిరోజు విచారణ ముగిసిన తర్వాత ఆమెను కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా భర్త అనిల్ కుమార్.. సోదరుడు కేటీఆర్.. మేనబావ హరీశ్ రావులు ఆమెకు ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది.