ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముందు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు, వైసీపీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డి పేరు బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో కీలకంగా భావిస్తోన్న సౌత్ గ్రూప్ నకు కవిత, మాగుంట కింగ్ పిన్ లుగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల కవితను సీబీఐ విచారణ జరిపిన వైనం సంచలనం రేపింది. అయితే, తన పేరు చార్జిషీటులో లేదని, విచారణ కోసం మాత్రమే నోటీసులు ఇచ్చారని కవిత తెలిపారు.
కానీ, ఆ తర్వాత మరో సెక్షన్ కింద కవితకు నోటీసులు ఇచ్చిన అధికారులు..మరో మారు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్కామ్ లో కవిత నిందితురాలేనని సీబీఐ స్పష్టం చేయడం సంచలనం రేపుతోంది. తాజాగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదించిన చార్జి షీటులో కవితను నిందితురాలిగా పేర్కొన్న విషయం వెలుగులోకి రావడం షాకింగ్ గా మారింది. ఈ చార్జిషీటులో పలు సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ కేసులో దాదాపు 10 వేల పేజీల తొలి చార్జిషీట్ లో దేశ రాజకీయాలు కుదిపేసేలా సంచలన విషయాలను సీబీఐ పొందుపరిచింది. ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగి. అక్రమంగా అర్జించేలా ఆప్ నేతలు లిక్కర్ పాలసీని రూపొందించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌత్‌గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని సీబీఐ అనుమానిస్తోంది. కవిత, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్, వైసీపీ ఎంపీ మాగుంట, మరికొందరు ఈ సౌత్ గ్రూప్ ను శాసిస్తున్నారని అనుమానిస్తున్నారు. మనీలాండరింగ్ కోణంలో చేసిన దర్యాప్తులో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయని సీబీఐ చెబుతోంది.
అంతేకాదు, దాదాపు వంద కోట్ల లంచం ఇచ్చి మొత్తం ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని సౌత్ గ్రూప్ భావించిందని కూడా సీబీఐ ఆరోపిస్తోంది. దక్షిణాదికి, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు ఈ ప్రకారం భారీగా కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్న విషయాన్ని చార్జి షీటులో సీబీఐ ప్రస్తావించింది. సౌత్ సిండికేట్ తరఫున అభిషేక్ బోయిన్పల్లి ఈ వ్యవహారం నడిపినట్లు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది.
రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో అభిషేక్ తరలించారని, దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు ఆ సొమ్ము అందజేశారని సీబీఐ పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను లోబరుచుకొని, హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు వచ్చేలా, అందులో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని సీబీఐ తెలిపింది.