తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత మీద ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కవితను అక్కా అని సంబోధిస్తూ సుఖేష్ ఆమెతో చాట్ చేసినట్టుగా కనిపిస్తున్న వాట్సాప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కవితను ఉద్దేశిస్తూ సుకేష్ లేఖ విడుదల చేయడం సంచలనం రేపింది. 2020లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ల ఆదేశాల ప్రకారం 15 కోట్లు కవితకు ఇచ్చినట్లు సుకేష్ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో కవిత పేరు రావడం, ఆమెను సీబీఐ విచారణ జరపడం నేపథ్యంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు లేఖ రాయడం సంచలనం రేపింది. మరోవైపు, టూల్ కిట్ లో కవితపై బిజెపి ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేయడం కూడా షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కవిత స్పందించారు. సుకేష్ తో తనకు పరిచయం లేదని, పాత్రికేయులు కనీస ధర్మం కూడా పాటించకపోవడం సరికాదని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ మీద, తనమీద కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు వస్తున్న మద్దతు చూసి ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక తెలంగాణ వ్యతిరేకులు, కొన్ని మీడియా ఛానళ్లు ఈ రకమైన ప్రచారానికి తెరతీశాయని ఆరోపించారు.