ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని వైసీపీ అభ్యర్థుల విషయంలో జగన్ తుది నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలతో పాటు స్థానిక సంస్థల కోటా కింద 11 ఎమ్మెల్సీ స్థానాల కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం వైసీపీలోని నాయకుల మధ్య పోటీ నెలకొంది. చాలా మంది ఆశావహులు జగన్ కటాక్షం కోసం ఎదురు చూశారు. కానీ సామాజిక సమీకరణాలు ఆయా జిల్లాల్లో పరిస్థితులు పరిగణలోకి తీసుకుని జగన్ 14 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా ప్రకటించారు. అందులో ఎమ్మెల్యే కోటా కింద శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లాకు చెందిన ఇసాక్ బాషా, కడప నేత గోవింద రెడ్డిని జగన్ ఎంపిక చేశారు.
మొదటి నుంచి..
ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం డీసీసీబీ మాజీ ఛైర్మన్ పాలవలస విక్రాంత్‌కు ఎమ్మెల్సీ టికెట్ జగన్ కేటాయించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గత మూడు తరాలుగా పాలవలస కుటుంబం రాజకీయాల్లో ఉంది. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన ఆ కుటుంబం.. ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతోంది. పార్టీకి అండగా ఉన్న ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉన్నారు. గతంలో విక్రాంత్‌కు నామినేటెడ్ పోస్ట్ డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఈ పదవి నుంచి దిగిపోగానే ఇప్పుడు ఎమ్మెల్సీని చేస్తున్నారు. మరోవైపు విక్రాంత్ సోదరి రెడ్డి శాంతి ప్రస్తుతం పాటపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తల్లి పాలవలస ఇందుమతి రేగిడి జెడ్పీటీసీగా భార్య గౌరీ పార్వతి పాలకొండ జెడ్పీటీసీగా ఉన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం జెడ్పీ ఛైర్పర్సన్ పదవి కూడా ఆ కుటుంబానికే దక్కుతుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది చేజారినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
కష్టానికి తగినట్లు..
వైసీపీ పార్టీ కోసం పాలవలస కుటుంబం కష్టానికి తగినట్లుగానే జగన్ వాళ్లకు పదవులు ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణాల్లో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కీలక నేతగా ఉన్న విక్రాంత్‌ను ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ హవా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పాలకొండ, పాతపట్నం, రాజాం అసెంబ్లీ సీట్లను వైసీపీ సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లోనూ ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేయడంలో పాలవలస కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఇక ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విక్రాంత్ కుటుంబం కృషి చేసింది. పార్టీ కోసం ఇంతలా పాటుపడుతున్న ఆ కుటుంబానికి అందుకే జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.